సెల్ఫీ సంగతులు | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సంగతులు

Published Mon, Jul 13 2015 6:56 AM

సెల్ఫీ సంగతులు - Sakshi

సాక్షి: ‘సెల్ఫీ’... నేటి కాలంలో దీని గురించి తెలియనివారుండరు. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్లు వంటి సాధనాలతో ఎవరి చిత్రాలను వారు తీసుకోవడాన్ని క్లుప్తంగా ‘సెల్ఫీ’ అనవచ్చు. చిన్నారులు, యువత మొదలు.. రాజకీయ, సినీ, క్రీడలు.. ఇలా అన్ని వయసుల వారు, అన్ని రంగాలవారికీ ‘సెల్ఫీ’లంటే క్రేజే. ప్రపంచాన్ని ఊపేస్తున్న సెల్ఫీల గురించి మనకు తెలిసింది తక్కువే. అది ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది.. దాని వెనక ఉన్న ఇతర ఆసక్తికర సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..
 
1839లోనే తొలి సెల్ఫీ:
సాధారణంగా స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్ కెమెరాలను ఉపయోగించి తీసుకునే చిత్రాలను ‘సెల్ఫీ’ అంటారు. ఇటీవలి కాలంలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ దాదాపు రెండు శతాబ్దాలకు ముందే అంటే 1839లోనే తొలి సెల్ఫీ తీసుకున్నారు. అప్పటికే ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌గా పేరుపొందిన రాబర్ట్ కార్నెలియస్ తొలి సెల్ఫీ తీసుకున్నట్లు ఆధారాలున్నాయి. అప్పుడు వినియోగించే కెమరాలో ఫొటో తీసేందుకు ఒక నిమిషం పడుతుంది. కెమెరా లెన్స్ క్యాప్ తీసి దాని ముందు నిలబడాలి. ఫొటో తీయగానే లెన్స్‌ని తిరిగి ఎప్పటిలాగే అమర్చాలి. ఇలా చేసే క్రమంలో రాబర్ట్ తన ఫొటోని తానే తీసుకోగలిగాడు. అలా అది మొదటి సెల్ఫీగా నమోదైంది. అలాగే అప్పట్లో ఫ్రంట్ కెమెరా విధానం ఉండేది కాదు కాబట్టి అద్దంలో తమని తాము ఫొటోలు తీసుకునే వారు. ఒకరకంగా ఇవి కూడా సెల్ఫీలే.

పదేళ్లుగా తిరిగి ప్రాచుర్యంలోకి:
సొంతంగా ఫొటోలు తీసుకునే విధానం ఎప్పటినుంచో ఉన్నా ఈ విధానం ‘సెల్ఫీ’గా ప్రాచుర్యం పొందింది మాత్రం 2002 నుంచే. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్‌సైట్లో ఇలా సెల్ఫీ ఫొటోలను అప్‌లోడ్ చేసేవారు. అయితే అవి సాధారణ కెమెరాతో తీసినవి మాత్రమే. అనంతరం ‘మై స్పేస్’ అనే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లో ఎక్కువమంది ఇలాంటి సెల్ఫీ ఫొటోలను అప్‌లోడ్ చేసేవారు. కానీ ఇందులో అప్‌లోడ్ చేయడాన్ని అప్పట్లో ఓ చిన్నతనంగా భావించేవారు.

2009లో ఫ్లిక్కర్‌లో యువతరం అధికంగా సెల్ఫీలు పోస్ట్ చేసేవారు. దీంతో సెల్ఫీలకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటినుంచి సెల్ఫీలకు క్రేజ్ పెరిగిపోయింది. ఫేస్‌బుక్‌లో సెల్ఫీలను పోస్ట్ చేయడం ఓ క్రేజ్‌గా మారింది. వినియోగదారులు సెల్ఫీలు పోస్ట్ చేసేలా ఫేస్‌బుక్ ప్రత్యేక దృష్టి సారించింది. 2010లో ఆపిల్ ఐఫోన్ 4 విడుదలైంది. ఇందులో ఉన్న ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లలో అప్‌లోడ్ చేయడం ఈ కాలంలో ఎక్కువైంది. మొదట్లో సెల్ఫీలపై యువతరమే అధికంగా ఆసక్తి చూపేది. క్రమంగా అందరికీ సెల్ఫీలంటే మోజు పెరిగిపోయింది. అలాగే మొబైల్స్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా సెల్ఫీస్టిక్‌లు అందుబాటులోకి వచ్చాయి.

వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2013:
సెల్ఫీ తీసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా యువతరం ఆసక్తి కనబరచడంతో ఈ పదానికీ గుర్తింపు దక్కింది. 2012లో టైమ్స్ మ్యాగజైన్ ‘సెల్ఫీ’ని ఆ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న టాప్-10 పదాల్లో ఒకటిగా గుర్తించింది. 2013లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సెల్ఫీని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించి, ఆ పదాన్ని డిక్షనరీలో చేర్చింది.

సోషల్‌ మీడియా కీలకం:
సెల్ఫీ క్రేజ్ పెరిగిపోవడానికి సోషల్ మీడియానే కారణం. ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారానే సెల్ఫీలంటే ఇష్టం పెరిగింది. ఒకప్పుడు ఫొటోలు వ్యక్తిగతమైనవి మాత్రమే. కానీ సోషల్ మీడియా వ్యాప్తితో ఫొటోలు పబ్లిక్ ఇష్యూగా మారిపోయాయి. కేవలం ఈ సైట్లలో పోస్ట్ చేసేందుకోసమే చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ప్రమాదాలకు నెలవు:
సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేసి మంచి కామెంట్లు, ఎక్కువ లైక్‌లు సంపాదించాలన్న ఆలోచనలతో యువతరం విభిన్న తరహాలో, కొత్త దనంతో కూడిన సెల్ఫీలు తీసుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందల సంఖ్యలో యువతరం గాయాలపాలైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అంశం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అనేక దేశాలు యువతరానికి సెల్ఫీలు తీసుకునే విషయంలో సూచనలు కూడా చేస్తున్నాయి.
 
సెల్ఫీలో రకాలు:
వెల్ఫీ: వర్క్‌అవుట్స్ చేస్తూ సెల్ఫీ తీసుకోవడాన్ని వెల్ఫీ అంటారు.
హెల్ఫీ: వ్యక్తులు వారి హెయిర్‌కు సంబంధించిన విషయాల్ని హైలైట్ చేస్తూ తీసుకునే సెల్ఫీని హెల్ఫీ అంటారు.
డ్రెల్ఫీ: ఏదైనా డ్రింక్ చేస్త్తూ తీసుకునే సెల్ఫీ డ్రెల్ఫీ.

Advertisement

తప్పక చదవండి

Advertisement