సింగపూర్ విమానంలో మంటలు | Plane catches fire while making emergency landing in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ విమానంలో మంటలు

Jun 27 2016 8:53 AM | Updated on Sep 4 2017 3:33 AM

సింగపూర్ విమానంలో మంటలు

సింగపూర్ విమానంలో మంటలు

సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఒకటి అ‍త్యవసర ల్యాండింగ్ చేస్తుండగా, దానికి మంటలు అంటుకున్నాయి.

సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఒకటి అ‍త్యవసర ల్యాండింగ్ చేస్తుండగా, దానికి మంటలు అంటుకున్నాయి. చాంగి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుంచి ఇటలీలోని మిలన్ వెళ్లాల్సిన ఈ విమానం ఉదయం 2.05 గంటలకు బయల్దేరింది. కొంత సేపు ప్రయాణించిన తర్వాత, ఇంజన్లో సమస్య వచ్చిందని, అందువల్ల విమానాన్ని సింగపూర్కు తీసుకెళ్లిపోతున్నామని పైలట్ ప్రకటించాడు. ఆ సమయానికి విమానంలో 222 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు.

ఉదయం 7 గంటల సమయంలో విమానం ల్యాండ్ అవుతుండగా... దాని కుడివైపు రెక్కలకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటలను వెంటనే ఆర్పేసినట్లు విమానంలోని ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో చేసిన పోస్టింగుల ద్వారా తెలిసింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశామని, ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వాళ్లందరినీ మెట్ల మార్గం గుండా కిందకు దింపి, అక్కడి నుంచి వాహనాలలో విమానాశ్రయంలోకి పంపారు. లీ బీ యీ అనే ప్రయాణికురాలు కిటికీలోంచి తన స్మార్ట్ఫోన్తో వీడియో తీసి దాన్ని వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను ఇప్పుడే చావును తప్పించుకున్నానని ఆమె చెప్పారు. విమానంలో ఉండగా తనకు ఇంధనం వాసన బాగా ఎక్కువగా వచ్చిందని, కాసేపటికి కుడివైపు ఇంజన్లో ఆయిల్ లీకవుతుండటంతో విమానాన్ని తిరిగి సింగపూర్ తీసుకెళ్తున్నట్లు పైలట్ ప్రకటించాడని ఆమె తెలిపారు. విమానం ల్యాండయ్యి, మంటలు అంటుకున్న ఐదు నిమిషాల తర్వాత ఫైరింజన్లు వచ్చాయని.. ఆ ఐదు నిమిషాలు మాత్రం తమ పాలిట నరకమేనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement