
ఇస్లామాబాద్: అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఒకసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో గానీ ఉండదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒకసారి యుద్ధం ప్రారంభమయ్యాక అది ఎక్కడ వరకు వెళ్తుందో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతోపాటు ఇప్పటివరకు జరిగిన యుద్ధాలన్నీ అవగాహనలేమి కారణంగానే ప్రారంభమయ్యాయని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బుధవారం ఆయన పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పాక్ యుద్ధవిమానాలను తమ వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టిందని.. ఒక పైలట్ జాడ తెలియడం లేదంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడటం గమనార్హం. ‘మీరు మా(పాక్) దేశంలోకి వస్తే.. మేము మీ(భారత్) దేశంలోకి రాగలమని తెలపడానికే బుధవారం నాటి సైనిక చర్యలు. భారత్‌కు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశాం. ఒక భారత పైలట్ ప్రస్తుతం మా వద్ద ఉన్నారు. ఇరు దేశాలు కూర్చొని.. చర్చల ద్వారా ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దుకుందాం. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధను అర్థం చేసుకోగలం. పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ప్రస్తుత పరిస్థితిని భారత్ మరింత దిగజారుస్తుందని నాకు అనుమానం ఉంది. భారత్ గనుక దాడులకు ఉదృతం చేస్తే.. మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం ’అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.