
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ కుటిలనీతిని మరోసారి బయటపెట్టింది. ఓ వైపు సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతూనే మరోవైపు భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానికి తావు లేదని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి చోటు లేదని, అయితే అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలకు భారత్‌తే బాధ్యతని పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఆరోపించారు. 2013 కాల్పుల విరమణ ఒప్పందాన్ని కట్టుదిట్టంగా అమలుచేసేందుకు పాక్ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నట్టు పాక్ పత్రిక డాన్ కథనం వెల్లడించింది. భారత దళాలు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని గఫూర్ ఆరోపించారు.
సరిహద్దుల వెంబడి కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ కొనసాగిస్తే రంజాన్ కాల్పుల విరమణపై భారత్ పునరాలోచిస్తుందని స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ స్పందించింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
రంజాన్ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిలిపివేస్తూ కాల్పుల విరమణ పాటిస్తోందని, పాక్ ఇదేతీరున వ్యవహరిస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరాలోచిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ తేల్చిచెప్పారు.