గిల్గిట్‌ బాల్టిస్తాన్‌: భారత్‌పై పాక్ తీవ్ర వ్యాఖ్యలు

Pakistan Rejects IMD Forecast Includes POK Gilgit Baltistan In Report - Sakshi

గిల్గిట్‌ బాల్టిస్తాన్‌పై పాకిస్తాన్‌ పైత్యం.. సర్వాధికారాలూ మావే అన్న భారత్‌

ఇస్లామాబాద్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని గిల్గిట్ బాల్టిస్తాన్‌, ముజఫరాబాద్‌లను జమ్మూ కశ్మీర్‌ సబ్‌ డివిజన్‌గా పేర్కొంటూ భారత వాతావరణ శాఖ నోటీసు జారీ చేయడంపై పాకిస్తాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌ ఏకపక్ష నిర్ణయాలు జమ్మూ కశ్మీర్‌కు ఉన్న వివాదాస్పద స్టేటస్‌ను మార్చలేవని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్‌ బాధ్యతారాహిత్య, కవ్వింపు చర్యలకు ఇది నిదర్శనమంటూ రెచ్చిపోయింది. ఈ మేరకు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘భారత్‌ విడుదల చేసిన ‘‘పొలిటికల్‌ మ్యాప్స్‌’’ చట్టపరంగా చెల్లవు. వాస్తవాలకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. భారత్‌ చర్య ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (భారత్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర ఆరోపణలు)

కాగా పీఓకేలోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలంటూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన.. భారత ప్రభుత్వం పాక్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో అంతర్భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు దాయాది దేశ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేస్తూ.. భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసింది. కశ్మీర్‌లోని ఆక్రమించిన ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. గిల్గిట్‌ బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని ఈ సందర్భంగా భారత్‌ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మే 6న విడుదల చేసిన వాతావరణ శాఖ బులెటిన్‌లో జమ్మూ అండ్‌ కశ్మీర్‌, లఢఖ్‌, గిల్గిట్‌ బాల్టిస్తాన్‌, ముజఫరాబాద్‌లను జమ్మూ కశ్మీర్‌లోని సబ్‌ డివిజన్లుగా పేర్కొంటూ మరోసారి కౌంటర్‌ ఇచ్చింది.(నలుగురు పాక్‌ సైనికుల హతం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top