మళ్లీ రెచ్చిపోయిన ఇమ్రాన్‌..

Pakistan PM Imran Khan Calls On Kashmiris To Take Up Arms - Sakshi

ఇస్లామాబాద్‌ : కశ్మీరీలకు మద్దతుగా పీఓకేలోని ముజఫరాబాద్‌లో శుక్రవారం జరిగిన సంఘీభావ ర్యాలీలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి రెచ్చిపోయారు. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరీలు ఆయుధాలు చేబూని పోరాడాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రపంచానికి తాను కశ్మీర్‌ రాయబారిగా వ్యవహరిస్తూ వారికి బాసటగా నిలుస్తానని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తాను కశ్మీరీలను నిరాశపరచనని చెబుతూ కశ్మీర్‌ సమస్య మానవతా సంక్షోభమని వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లు సైతం కశ్మీర్‌ అంశాన్ని చర్చించాయని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో భారత సేనలు హింసకు తెగబడినా ఎలాంటి ఫలితం ఉండదని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.

భారత్‌ ఎలాంటి దుందుడుకు వైఖరి ప్రదర్శించినా తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. కశ్మీర్‌ ప్రజలు భారత్‌ను వ్యతిరేకించాలని, బీజేపీ-ఆరెస్సెస్‌ నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వంపై ఆయుధాలతో తిరగబడాలని కోరారు. అమాయక కశ్మీరీల సహనాన్ని ప్రధాని మోదీ పరీక్షిస్తున్నారని అన్నారు. భారత దళాల అణిచివేతకు విసిగిన 20 సంవత్సరాల కశ్మీర్‌ యువకుడు తన శరీరానికి బాంబులు అమర్చుకుని పుల్వామాలో సైన్యంపై దాడికి దిగాడని చెప్పుకొచ్చారు. పుల్వామా దాడికి భారత్‌ పాకిస్తాన్‌ను నిందిస్తూ బాలాకోట్‌లో వైమానిక దాడులకు దిగిందని అన్నారు. భారత విమానాన్ని తాము కూల్చివేశామని, వారి పైలట్‌ (వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌)ను తిరిగి సత్వరమే అప్పగించలేదని గుర్తుచేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఇమ్రాన్‌ అన్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు పాక్‌ తలొగ్గిందని మోదీ భారత్‌ ప్రజలకు చెప్పుకున్నారని, నిజమైన పాకిస్తానీ ఎన్నడూ మృత్యువుకు భయపడడనే సంగతి మోదీకి తెలియదని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top