
లాహోర్: బలవంతపు వివాహం చేసుకున్న ఓ నవవధువు పథకం ప్రకారం విషమిచ్చి 13 మంది అత్తింటివారిని హతమార్చింది. కుటుంబహత్యల కేసులో అరుదైన ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రావిన్సులోని ముజఫర్‌గఢ్‌లో జరిగింది. ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాసంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. ఇటీవల బలవంతపు పెళ్లి చేసుకున్న హాసియా అనే మహిళ తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. భర్త అమ్జద్‌ను చంపేసేందుకు పాలలో విషం కలిపింది.
అయితే అదృష్టవశాత్తు అమ్జద్ ఆ పాలు తాగలేదు. దీంతో అవే పాలతో లస్సీ తయారుచేసి అత్తింటివారందరికీ అందించింది. విషతుల్యమైన ఆ లస్సీ తాగి 13 మంది చనిపోయారు. మరో 14 మంది విషప్రభావంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పథకం ప్రకారమే తానీ పని చేశానని పోలీసు విచారణలో హాసియా ఒప్పుకుంది. హత్యలో హాసియాకు సాయపడినట్లుగా భావిస్తున్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.