భూటాన్‌ విశ్వసనీయ పొరుగుదేశం | Narendra Modi cements Bhutan ties with RuPay launch | Sakshi
Sakshi News home page

భూటాన్‌ విశ్వసనీయ పొరుగుదేశం

Aug 18 2019 3:59 AM | Updated on Aug 18 2019 9:08 AM

Narendra Modi cements Bhutan ties with RuPay launch - Sakshi

ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం పలికి వెంట తీసుకెళ్తున్న భూటాన్‌ ప్రధాని షెరింగ్‌

పారో/థింపూ: భూటాన్‌ భారత్‌కు ఎప్పుడూ విశ్వసనీయ పొరుగుదేశమేనని ప్రధాని మోదీ చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ శనివారం భూటాన్‌ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్, మంత్రివర్గ సభ్యులతో కలసి మోదీకి పారాలోని విమానాశ్రయంలో  స్వాగతం పలికారు. తర్వాత ఇరువురు ప్రధానులు కలసి పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. అనేక రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా చర్చలు కొనసాగించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ‘భూటాన్‌ అభివృద్ధిలో భారత్‌ ప్రధాన భాగస్వామి కావడం ఒక విశేషం. భూటాన్‌  పంచవర్ష ప్రణాళికలలో భారత్‌ సహకారం ఇకపైన కూడా కొనసాగుతుంది’ అని మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధన, విమానయానం, ఐటీ, విద్యుత్, విద్యారంగానికి సంబంధించి ఇరు దేశాలు 10 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీ దేశ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌తో కూడా భేటీ అయ్యారు.

రూపే కార్డును ప్రారంభించిన మోదీ
భూటాన్‌లో దక్షిణాసియా ఉపగ్రహ వినియోగం కోసం ఇస్రో సహాయంతో అభివృద్ధి చేసిన గ్రౌండ్‌ ఎర్త్‌ స్టేషన్, సాట్కామ్‌ నెట్‌వర్క్‌ను మోదీ, షెరింగ్‌ కలిసి ప్రారంభించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా భూటాన్‌ అభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. సిమ్తోఖా జొంగ్‌ వద్ద  భూటాన్‌లో రూపే పే కార్డును మోదీ ప్రారంభించారు. ‘భూటాన్‌లో రూపే పే కార్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధానం డిజిటల్‌ చెల్లింపులు, వాణిజ్యం, పర్యాటక రంగంలో ఇరుదేశాల సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నాను’ అని వెల్లడించారు. మాంగ్దేచు జలవిద్యుత్‌ కర్మాగారాన్ని ప్రారంభించిన మోదీ, ఐదు దశాబ్దాల భారత–భూటాన్‌ జలవిద్యుత్‌ సహకారాన్ని గుర్తుచేసే స్టాంపులను కూడా విడుదలచేశారు. మోదీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాజధాని థింపూకి వెళ్తున్నప్పుడు ప్రజలు త్రివర్ణ పతాకాలు ఊపుతూ దారిపొడవునా మోదీకి స్వాగతంపలికారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement