పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్‌ | Sakshi
Sakshi News home page

పాక్‌కు సాయం ఆపేయండి.. అమెరికాకు విజ్ఞప్తి!

Published Thu, Jun 4 2020 3:55 PM

MQM Chief Altaf Hussain Appeal To Pentagon Cut Military Aid To Pakistan - Sakshi

లండన్‌: మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్‌ హుసేన్‌ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫంక్తువా, గిల్గిట్‌ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్‌- ఖైదా, తాలిబన్‌, లష్కర్‌-ఎ-తొయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రసంస్థలను పాక్‌ ఐఎస్‌ఐ సృష్టించిందని.. వందలాది మంది ఉగ్రవాదులను తయారు చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య ముసుగులో ఐఎస్‌ఐ చేస్తున్న అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలను అత్యంత అణచివేతకు గురిచేసే ప్రపంచంలో ఏకైక ప్రభుత్వాన్ని నడిపిస్తోంది సైన్యమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.(పాక్‌లో హిందువులపై పెచ్చుమీరుతున్న అకృత్యాలు)

ఈ మేరకు అల్తాఫ్‌ పెంటగాన్‌కు లేఖ రాశారు. ‘‘పాకిస్తాన్‌ సైన్యం సింధు, బలూచిస్తాన్‌, కేపీకే, గిల్టిట్‌ బల్టిస్తాన్‌ ప్రాంతాలను ఆక్రమించింది. మైనార్టీలపై పాశవిక, క్రూర చర్యలకు పాల్పడుతోంది. నేటికీ అక్కడ అణచివేత కొనసాగుతోంది. శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకునే మీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌కు అందిస్తున్న పౌర, సైన్య సహకారాన్ని నిలిపివేయండి’’అని లేఖలో కోరారు. ఇక అమెరికాలో ఆగ్రహజ్వాలలకు కారణమైన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై కూడా అల్తాఫ్‌ స్పందించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు అధికారులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని.. అదే విధంగా జాతి వివక్షను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (లాక్‌డౌన్‌ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌)

కాగా పాకిస్తాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించేందుకు ముత్తాహిద కౌమీ ఉద్యమం పేరిట అల్తాఫ్‌ హుసేన్‌ 1984, మార్చి 18న పార్టీని స్థాపించారు. సెక్యూలర్‌ పార్టీగా పేరొందిన ఎంక్యూఎమ్‌ ప్రస్తుతం రెండు వర్గాలు చీలిపోయింది. ఎమ్‌క్యూఎమ్‌- లండన్‌ బాధ్యతలను అల్తాఫ్‌ పర్యవేక్షిస్తుండగా.. పాకిస్తాన్‌లోని పార్టీ విభాగాన్ని ఖాలిద్‌ మక్బూల్‌ సిద్ధిఖీ నడిపిస్తున్నారు. ముజాహిర్ల(పాకిస్తాన్‌కు వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు) హక్కులకై పోరాడే ఎంక్యూఎమ్‌ 1990-1999 మధ్య కాలంలో పాకిస్తాన్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. 

చదవండి: హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. నేపాల్‌, పాకిస్తాన్‌ మద్దతు

Advertisement
 
Advertisement
 
Advertisement