పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు | Sakshi
Sakshi News home page

పాక్‌లో హిందువులపై పెచ్చుమీరుతున్న అకృత్యాలు

Published Tue, Jun 2 2020 7:35 PM

Forced Religion Conversion Of Hindu Girls And Persecution Rise In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. హిందూ యువతుల అపహరణ, మత మార్పిడి ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఒకే జిల్లాలో వేర్వేరు చోట్ల ఇలాంటివి రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. సాయుధులైన దుండగులు అక్రమంగా బాధితుల ఇంట్లో చొరబడి వారిని లాక్కెళ్లడం ఆందోళనలకు దారి తీసింది. వివరాలు.. సింధు ప్రావిన్స్‌లోని మీర్పూర్‌ ఖాస్‌ జిల్లా రాయీస్‌ నేహాల్‌ ఖాన్‌ గ్రామానికి చెందిన రాయ్‌ సింగ్‌ కోహ్లి తన కూతురు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. పదిహేనేళ్ల సుంటారాను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారని.. దీంతో వెంటనే తాము స్థానిక పోలీస్‌ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. (లాక్‌డౌన్‌ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం: ఇమ్రాన్‌ ఖాన్‌)

ఈ క్రమంలో చాలా సేపటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ కూతురిని వెనక్కి తీసుకురావాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఇక అదే జిల్లాలోని హాజీ సయీద్‌ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. వివాహిత అయినటువంటి 19 ఏళ్ల భగవంతిని కొంతమంది దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఇస్లాం స్వీకరించాలంటూ ఆమెను బలవంతపెట్టారు. ఈ క్రమంలో భగవంతి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషనుకు వెళ్లి నిరసన తెలపగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న సదరు వ్యక్తులు.. భగవంతి మతం మారినట్లుగా కొన్ని పత్రాలను పోలీసులకు సమర్పించారు. దీంతో తమ కూతురి జీవితం నాశనమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. (పాకిస్తాన్‌లో వారు మాత్రమే ఆ పోస్టులకు అర్హులు)

కాగా సింధు ప్రావిన్స్‌లోని థార్‌పర్కర్‌ జిల్లాలోని బార్మేలీలో నివసిస్తున్న హిందువులపై ఇదే రోజు హేయమైన దాడి జరిగింది. పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా వారిపై దాడిచేసిన దుండగులు ఇళ్లను నేలమట్టం చేశారు. ఇక కొన్నిరోజుల క్రితం మంత్రి సమక్షంలోనే పంజాబ్ ప్రావిన్స్‌లోని భ‌వ‌ల్పూర్‌లో మైనారిటీల నివాసాల‌ను బుల్డోజ‌ర్ల‌తో నేల‌మ‌ట్టం చేసిన విషయం తెలిసిందే.(హిందువుల బ‌స్తీ నేల‌మ‌ట్టం చేసిన పాకిస్తాన్‌)

Advertisement
Advertisement