వాట్సాప్‌ హ్యాకింగ్‌.. వెలుగులోకి సంచలన అంశాలు!

Israeli Spyware Targeted Indian Journalists, Activists, Says WhatsApp - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సాప్‌ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ సంస్థ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది.

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారని, ఇందుకుగాను ఇజ్రాయెల్‌ కంపెనీ ప్రభుత్వ గూఢచారులకు వెన్నుదన్నుగా నిలిచిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌కు సమాధానమిస్తూ వాట్సాప్‌ ఈ విస్మయ పరిచే విషయాలను వెల్లడించింది. ఇలా వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌ గురైన వ్యక్తులు భారతీయులు కూడా ఉన్నారు. అయితే, సరిగ్గా ఎంతమంది వాట్సాప్‌ ఖాతాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలను వాట్సాప్‌ వెల్లడించలేదు. జర్నలిస్టులు, విద్యావేత్తలు, దళిత, మానవ హక్కుల కార్యకర్తలు ఇలా కనీసం 24మందికిపైగా వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో రెండువారాలపాటు వారి వాట్సాప్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని, ఈ విషయాన్ని స్పెషల్‌ మెసెజ్‌ ద్వారా హాకింగ్‌ బారిన పడిన వ్యక్తులకు తెలియజేశామని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

‘2019 మే నెలలో అత్యంత పటిష్టమైన సైబర్‌ అటాక్‌ను మేం అడ్డుకున్నాం. మా వీడియో కాలింగ్‌ సిస్టంలోకి చొరబడి.. పలువురు వాట్సాప్‌ యూజర్ల మొబైల్‌ డివైజ్‌ల్లోకి మాల్‌వేర్‌ను పంపేందుకు ఈ అటాక్‌ ప్రయత్నించింది. ఈ దాడి జరిగిన యూజర్‌ వీడియో కాల్‌ను ఎత్తకపోయినా.. ఇది మొబైల్‌లోకి చొరబడుతుంది. మేం వెంటనే కొత్త ప్రొటెక్షన్స్‌ యాడ్‌ చేసి వాట్సాప్‌ నూతన అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల ఖాతాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. నేరుగా ఈ సైబర్‌ అటాక్‌ బారిన పడినట్టు భావిస్తున్న దాదాపు 1400మంది యూజర్లకు ప్రత్యేక వాట్సాప్‌ మెసెజ్‌ ద్వారా సమాచారమిచ్చాం’ అని ఫేస్‌బుక్‌ తెలిపింది. దేశంలోని పలువురు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తల వాట్సాప్‌ ఖాతాలపై ప్రభుత్వం గూఢచర్యం నెరిపినట్టు వస్తున్న కథనాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రైవసీ హక్కుల పట్ల బీజేపీ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ గూఢచర్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top