అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయి

Iran Rejects USA Accusation Over Drone Attacks on Aramco plants - Sakshi

టెహ్రాన్‌ : సౌదీ అరేబియాలోని ఆరామ్‌కోకు చెందిన అతిపెద్ద చమురు క్షేత్రంలో ఉగ్రవాదులు డ్రోన్‌లతో దాడులు చేయడం తెలిసిందే. దాడులకు ఇరాన్‌ కారణమని అమెరికా ఆరోపించడంతో ఈ ఘటన అంతర్జాతీయ మలుపు తీసుకుంది. దాడికి మేమే కారణమని యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించారు. కానీ ఉగ్రదాడిలో ప్రధాన దోషి ఇరాన్‌ అని అమెరికా తేల్చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌పాంపియో మాట్లాడుతూ ‘సౌదీ అరేబియాపై జరిగిన దాదాపు 100 దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉంది. ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ, విదేశాంగ మంత్రి జరీఫ్‌లు ఈ దాడులతో తమకు ఏం సంబంధం లేదన్నట్లు నటిస్తున్నారు. ఈ దాడులు యెమెన్ నుంచి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇరాన్ ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరాపై దాడిని ప్రారంభించింది.’ అని ప్రకటించారు. దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చిన సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ‘ఇలాంటి దాడులను ఎదుర్కొనేంత సామర్థ్యం తమ దేశానికి ఉందని, ఎలాంటి చర్యలకైనా మేం సిద్ధంగా ఉన్నామని’ తెలిపారు. సౌదీ తీసుకునే నిర్ణయాలకు అమెరికా సహాయం ఉంటుందని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఈ దాడులతో ప్రపంచ వాణిజ్యం ఒడిదుడుకులకు లోనవుతందని’ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, అమెరికా ఆరోపణలపై ఇరాన్‌ భగ్గుమంది. అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌ సైనిక అధికారి ఒకరు మాట్లాడుతూ ‘దీని అర్థం ఏంటి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా? మేం యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధమే’ అని అమెరికాను హెచ్చరించారు. ‘సౌదీపై దాడుల వెనక ఇరాన్‌ హస్తం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయడానికి అమెరికా చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవన్నీ’ అని మండిపడ్డారు. ఇరాన్‌పై నిరంతరం ఒత్తిడి చేయడం ఒక హక్కుగా అమెరికా భావిస్తోంది. తీవ్ర ఒత్తిడి చేయాలని ప్రయత్నిస్తూ మరింత తీవ్రంగా అబద్ధాలు చెబుతోంది’ అని ఎద్దేవా చేశారు. ఇరాన్ నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అమెరికన్ స్థావరాలు, వాటి ఓడలు మా క్షిపణుల పరిధిలో ఉన్నాయనే విషయం అక్కడి నాయకులు మర్చిపోయారేమో అని ఆ అధికారి హెచ్చరికలు జారీచేశారు.

కాగా, సౌదీ అరేబియా తమపై జరుపుతున్న గగనతల దాడులకు వ్యతిరేకంగా 10 సాయుధ డ్రోన్‌లను సౌదీ చమురు క్షేత్రాలపై దాడులకు పంపించినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు మరోసారి స్పష్టం చేశారు. చదవండి : సౌదీ చమురు క్షేత్రాలపై ఉగ్రదాడి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top