ఎవరీ భారతీయ కుబేరుడు..?

 Indian billionaire hiring 12 staff to help daughter study at UK university - Sakshi

బ్రిటన్‌లోని స్కాట్లాండ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ విశ్వవిద్యాలయంలో చేరనున్న ఓ అమ్మాయికి ఆమె తండ్రి సమకూర్చిన సకల సౌకర్యాలను చూసి బ్రిటన్‌ పత్రికలు ముక్కున వేలేసుకున్నాయి. కూతురి సపర్యల కోసం భారతీయుడైన ఆ తండ్రి విలాసవంతమైన భవంతిని కొనుగోలుచేయడమేకాకుండా ఆమె అడుగులకు మడుగులొత్తేందుకు 12 మంది ఉద్యోగులను నియమించడం అక్కడి పత్రికల్లో పతాకశీర్షికలకెక్కింది. ప్రిన్స్‌ విలియమ్స్, అతని భార్య కేట్‌ మిడిల్టన్‌ చదివిన సెయింట్‌ ఆండ్రూస్‌ వర్సిటీలోనే ఓ భారతీయ కుబేరుడి కూతురు ఎంట్రీ అట్టహాసంగా మారింది.

స్కాట్‌లాండ్‌లో అత్యంత సుందరమైన భవంతుల్లో ఒకదాన్ని తండ్రి కొనుగోలుచేసి, ఆమెకు బాగా ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించేందుకు ఒక పాకశాస్త్రప్రవీణుడిని, ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఒక పనిమనిషిని, ఆమె డ్రెస్‌లు, ఆమెకు కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచేందుకు మరో మనిషిని, అమ్మాయి ఇంట్లోకి వచ్చేటపుడు వెళ్లేటపుడు తలుపులు తీసి పట్టుకోవడానికి మరో వ్యక్తినీ, ఇలా ఆమెకు దాదాపు అన్ని పనుల్లో సాయపడేందుకు 12 మంది ఉద్యోగులను నియమిం చారు ఆమె తండ్రి.

ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవాలని సిల్వర్‌ స్వాన్‌ రిక్రూట్‌మెంట్‌ అనే ఓ ప్రముఖ జాబ్‌ ఏజెన్సీలో ప్రకటన సైతం ఇచ్చారు. బలహీనంగా ఉండకుండా, హుషారుగా ఉండేవారు మాత్రమే కావాలని పేర్కొన్నారు. భవంతిలో పనిచేయనున్న ఉద్యోగులకు వేతనం సైతం భారీస్థాయిలోనే ఉంది. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.28 లక్షల వేతనం ఇస్తామని ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేది పెద్ద మిస్టరీ అయ్యింది. ఆ కుటుంబం వివరాలు తెలిసిన వారు సమాచారమివ్వాలని బ్రిటన్‌ పత్రికలు కోరడం మరో విశేషం.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top