ఆ అధికారం పాకిస్తాన్‌కు లేదు : భారత్‌

India Lodges Protest Over Pakistan Supreme Court Order On Gilgit Baltistan - Sakshi

పాక్ రాయబారికి లేఖ రాసిన భారత్‌

సాక్షి, న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం మండిపడింది. భారత్‌లో భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని పాక్‌కు స్పష్టం చేసింది. గిల్గిట్‌ బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని, దానిపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ సుప్రీం కోర్టుకు లేవని ఆ దేశ దౌత్యవేత్తకు తేల్చిచెప్పింది. 
(చదవండి : పాకిస్తాన్ తీరుపై ఆర్మీ చీఫ్‌ ఆగ్రహం)
 
గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా పాక్ ప్రభుత్వం 2018లో ఓ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని  సమర్థిస్తూ పాక్ సుప్రీం కోర్టు గత వారం తీర్పు వెలువరించింది. దీనీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అధికారికంగా పాక్ దౌత్యవేత్తలకు తన నిరసన తెలిపింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎటువంటి మార్పులను సహించబోమని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాక్ ప్రభుత్వానికి గానీ, సుప్రీం కోర్టుకు గానీ ఎటువంటి హక్కులు ఉండవని తెలిపింది. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఇదివరకు ఎన్నికలు ఉండేవి కావు. దాన్ని చట్టబద్ధంగా చేజిక్కించుకోడానికి పాక్ కుటిలబుద్ధితో 2018లో ఓ చట్టం తీసుకురాగా అక్కడి సుప్రీంకోర్టు గతవారం దానిపై రబ్బరు స్టాంపు వేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top