కామ్‌ కాసా ఒప్పందం అంటే..

India And America Signed On COMCASA Agreement - Sakshi

భారత్, అమెరికా మధ్య అత్యంత కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. కమ్యూనికేషన్స్‌ కంపాటిబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌ (కామ్‌ కాసా)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో అమెరికా భారత్‌కు విక్రయించే అత్యాధునిక ఆయుధాలకు కమ్యూనికేషన్‌ పరికరాలను అమర్చడం, ఉపగ్రహాల సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కలుగుతుంది.  ఇంతకీ ఈ ఒప్పందం ఏమిటంటే..

 • సైనిక అవసరాల కోసం అమెరికా నుంచి అత్యంత ఆధునిక సాంకేతికపరమైన యుద్ధ పరికరాలు కొనుగోలు చేయడం కోసం కుదుర్చుకోవాల్సిన మూడు ప్రధానమైన ఒప్పందాల్లో కామ్‌ కాసా ఒకటి. కామ్‌కాసా ఒప్పందానికి ముందు భారత్‌ 2016లో లాజిస్టిక్స్‌ ఎక్స్‌చేంజ్‌ మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన మూడో ఒప్పందం బేసిక్‌ ఎక్స్‌చేంజ్‌ అండ్‌ కోపరేషన్‌ అగ్రిమెంట్‌ ఫర్‌ జియోస్పాషియల్‌ కోపరేషన్‌పై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది.
   
 • అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ అమర్చడానికి వీలవుతుంది. సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్‌ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య కమ్యూనికేషన్లు మరింత విస్తృతం అవుతాయి. ఉదాహరణకి భారత్‌ వైపు చైనా యుద్ధ విమానాలు, లేదంటే జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్‌కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది.
   
 •  రక్షణ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన చట్టపరమైన ప్రాతిపదికలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది.
   
 •  ఈ ఒప్పందంతో అమెరికా నుంచి సీ గార్డియన్‌  డ్రోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డ్రోన్లు శత్రుదేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టగలవు. వాటిని టార్గెట్‌ కూడా చేయగలవు.
   
 • కమ్యూనికేషన్ల కోసం ఇప్పటివరకు భారత్‌ వినియోగిస్తున్న వ్యవస్థ కంటే అమెరికా అమర్చే పరికరాలు సాంకేతికపరంగా అత్యున్నతమైనవి. అత్యంత సురక్షితమైనవి కూడా. 
   
 • దీనిని గతంలో కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ సెక్యూరిటీ మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ అని పిలిచారు. అయితే ఇది భారత్‌కు చెందినదని స్పష్టంగా గుర్తించడానికి వీలుగా కామ్‌ కాసా అని మార్చారు.
   
 • ఈ ఒప్పందం గత పదేళ్లుగా ఇరుదేశాల మధ్య నానుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఒప్పందం భారత్‌ సైనిక స్వేచ్ఛ సమగ్రతను కాలరాసే చర్య అన్న అభిప్రాయం నెలకొంది. అంతేకాదు భారత్‌ సైన్యాన్ని అమెరికా రక్షణవ్యవస్థ చేతుల్లో పెట్టేసినట్టేనన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. రష్యాతో మనకున్న రక్షణ సంబంధాలపై కూడా కామ్‌కాసా ఒప్పందం ప్రభావాన్ని చూపిస్తుందని విమర్శలు వచ్చాయి.అయితే ట్రంప్‌ సర్కార్‌ మన దేశానికి వ్యూహాత్మక వ్యాపార భాగస్వామి హోదా కట్టబెట్టి భారత్‌ అంటే తమకున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో భారత్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top