పాక్‌లో ప్రిన్స్‌ విలియం దంపతుల పర్యటన

Imran Khan Talks With British Royal Couple William Kate Discusses India Pak Ties - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని బ్రిటన్‌ రాజవంశీకుడు ప్రిన్స్‌ విలియం అన్నారు. పాక్‌లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అగ్ర స్థానంలో ఉందని పేర్కొన్నారు. పాక్‌, యూకేలు చాలా విషయాల్లో సారూప్యాన్ని కలిగి ఉన్నాయని.. పాకిస్తాన్‌ మూలాలు ఉన్న సుమారు ఒకటిన్నర మిలియన్ల మంది ప్రజలు తమ దేశంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. బాలికా విద్య, సమానత్వం, వాతావరణ మార్పు తదితర సామాజిక అంశాలపై ప్రిన్స్‌ విలియం దంపతులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్యూక్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జి ప్రిన్స్‌ విలియం, డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జి కేట్‌ మిడిల్టన్‌ ఐదు రోజుల పాటు పాక్‌ పర్యటనకు బయల్దేరారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, అధ్యక్షుడు అల్విలను రాజ దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా సామాజిక అంశాల అవగాహనకై విలియం దంపతులు చేస్తున్న కృషిని ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందించారు. యువ పాకిస్తానీలతో రాజ కుటుంబీకులు భేటీ కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్‌ డయానాకు పాకిస్తాన్‌ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అదే విధంగా పొరుగుదేశాలైన భారత్‌, అఫ్గనిస్తాన్‌లతో తమ దేశానికి ఉన్న సంబంధాల గురించి వారికి వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విలియంకు తెలిపారు. అలాగే అఫ్గనిస్తాన్‌తో మైత్రి సాధించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

కాగా పాక్‌ పర్యటన(ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌ పంక్తువా)లో భాగంగా విలియం, కేట్‌ ఇస్లామాబాద్‌లో ఉన్న మహిళా మోడల్‌ కాలేజీని సందర్శించారు. యూకే విద్యా విధానాన్ని అనుసరిస్తున్న సదరు కాలేజీ విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మార్గల్లా హిల్స్‌లో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లో బ్రిటీష్‌ హై కమిషనర్‌ ధామస్‌ డ్ర్యూ, డ్యూక్‌ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శి సిమన్‌ కేస్‌, డ్యూక్‌ అండ్‌ డచెస్‌ కమ్యూనికేషన్‌ సెక్రటరీ క్రిస్టియన్‌ జోన్స్‌ విలియం దంపతుల వెంటే ఉన్నారు. కాగా 2006 తర్వాత బ్రిటన్‌ రాజ వంశీకులు పాకిస్తాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. ప్రిన్స్‌ చార్లెస్‌, కామిల్లా తర్వాత విలియం, కేట్‌ పాక్‌లో పర్యటించడాన్ని రిస్క్‌తో కూడిన పర్యటనగా కింగ్‌స్టన్‌ ప్యాలెస్‌ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌ పర్యటన అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top