
పట్టపగలే హిందూ టైలర్‌ను నరికి చంపేశారు
బంగ్లాదేశ్‌లోని తంగైల్ జిల్లాలో ఓ హిందూ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను చంపేసింది తామేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద మూక ప్రకటించుకుంది.
ఢాకా: బంగ్లాదేశ్‌లోని తంగైల్ జిల్లాలో ఓ హిందూ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను చంపేసింది తామేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద మూక ప్రకటించుకుంది. గోపాల్‌పూర్‌లో శనివారం పట్టపగలు 12.30 గంటల ప్రాంతంలో తన టైలరింగ్ దుకాణం ఎదురుగానే టైలర్ నిఖిల్ చంద్ర జోర్డర్ (50)ను దుండగులు కత్తులతో నరికి చంపారు. మోటారుబైకుల మీద వచ్చిన ముగ్గురు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
'ముగ్గురు యువకులు నిఖిల్ షాపు వద్దకు వచ్చారు. మీతో మాట్లాడుతామని చెప్తూ షాపు ఎదురుగా ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఆ వెంటనే విచక్షణారహితంగా ఆయనపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఆయన చనిపోయాడని నిర్ధారణ కాగానే సంఘటన స్థలం నుంచి పరారయ్యారు' అని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల లౌకిక, హేతువాదులైన బ్లాగర్లు, హక్కుల కార్యకర్తలు, ఓ ప్రొఫెసర్ హత్య తరహాలోనే నిఖిల్ హత్య కూడా జరిగింది. మహ్మద్ ప్రవక్తను దూషించాడనే ఆరోపణలపై నిఖిల్ గతంలో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు. నిఖిల్‌ను చంపింది తామేనని ఐఎస్‌ఐఎస్ బాధ్యత ప్రకటించుకుందని జిహాదీ ముప్పును పర్యవేక్షించే సైట్ (ఎస్‌ఐటీఈ) ఇంటెలిజెన్స్ గ్రూప్‌ను ఉటంకిస్తూ బీడీన్యూస్24 తెలిపింది.