ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మరణాలు

Global coronavirus death Lifeloss surpasses 10000 - Sakshi

ప్యారిస్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ప్రపంచం దాదాపు స్తంభించిపోతోంది. చైనాలో పుట్టి 150 దేశాలకుపైగా విస్తరించిన ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య పదివేలు దాటగాదాదాపు 2.44 లక్షల మందికి ఈ వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైరస్‌ మొదలైన చైనాలోని వూహాన్‌ ప్రాంతంలో రెండో రోజూ కొత్త కేసులేవీ నమోదు కాలేదు.  అమెరికాలోనూ కోవిడ్‌ మృతుల సంఖ్య 200 దాటిపోయింది.

స్పెయిన్‌లో వెయ్యికి చేరిన మృతుల సంఖ్య...
యూరోపియన్‌ దేశం స్పెయిన్‌లో శుక్రవారం నాటికి కరోనా వైరస్‌ ధాటికి వెయ్యిమంది బలయ్యారు. మొత్తం 20 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.  కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు శ్రీలంక శుక్రవారం నుంచి దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్‌తో ఇరాన్‌లో మృతుల సంఖ్య 1433కి చేరిందని, 20వేల మంది పాజిటివ్‌గా తేలారని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో మొత్తం 274 మంది వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లో  452 మంది వ్యాధి బారిన పడగా ముగ్గురు మరణించారు.  చైనాలో  ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 3,248కి చేరుకుంది. ఏటా జరిగే అగ్రదేశాధినేతల సమావేశం జీ–7తోపాటు ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డాయి.

ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి
రోమ్‌: ఇటలీలో కరోనా విలయం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 627 మంది బలయ్యారు. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,032కి చేరింది. అలాగే, కేసుల సంఖ్య 47 వేలు దాటింది. భారత ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘సార్క్‌ కరోనా ఎమర్జెన్సీ ఫండ్‌’కు నేపాల్‌ సుమారు 10 లక్షల డాలర్ల(10 కోట్ల నేపాలీ రూపాయలు) విరాళం ప్రకటించింది.  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మద్దతు ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top