ఆదమరిస్తే..అపాయమే! | Games With Wild Animals Are Dangerous | Sakshi
Sakshi News home page

ఆదమరిస్తే..అపాయమే!

May 20 2018 11:26 PM | Updated on May 29 2018 1:20 PM

Games With Wild Animals Are Dangerous - Sakshi

‘పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్‌ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఓ సినిమాలో హీరో డైలాగ్‌ ఇది. అయితే పులితోనే కాదు ఏ జంతువుతో అయినా సెల్ఫీలు, ఆటలు ప్రమాదమే. మచ్చిక చేసుకున్నవైనా, శిక్షణలోనివి అయినా.. క్రూర జంతువుల దగ్గర అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కాస్తంత పరధ్యానంగా ఉన్నా, సెల్ఫీల పేరుతో వాటితో ఆటలాడ్డానికి ప్రయత్నించినా అంతే సంగతులు. ఒక్కోసారి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి వాటికి నిదర్శనంగా నిలిచే కొన్ని సంఘటనలివీ..

సింహానికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు.. 
ఇది రెండేళ్ల కిందట మన హైదరాబాద్‌లోనే జరిగింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి(35) నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ సందర్శనకు వెళ్లాడు. అక్కడ సింహాలున్న ఎన్‌క్లోజర్‌ ప్రాంతంలోకి హఠాత్తుగా దూకాడు. అప్పటికే పీకల దాకా తాగేసి ఉన్న ఆ వ్యక్తి సమీపంలోని సింహాలను చూస్తూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకన్నట్లు చేయి చాపాడు. గమనించిన జూ నిర్వాహకులు వెంటనే సింహాల దృష్టిని మరల్చి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రక్షించారు. 

చిన్నారి తలను దొరకబుచ్చుకుంది
సౌదీ అరే బియాలోని జెడ్డా లో జరిగింది ఈ సంఘటన. జెడ్డా స్ప్రింగ్‌ ఫెస్టివల్‌లో భాగంగా పదేళ్ల లోపు చిన్నారులు కొంత మంది ఓ జూ లోకి వెళ్లారు. అక్కడ శిక్షకుడి పర్యవేక్షణలోని ఓ సింహం(ఆరు నెలల వయస్సు) చుట్టూ మూగారు. సరదాగా దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఉన్నట్లుండి ఆ సింహం పిల్ల ఓ చిన్నారిపై దాడికి దిగింది. ఆ చిన్నారి తలను నోట కరుచుకుంది. దీంతో భయపడిన మిగిలిన పిల్లలు దూరం జరిగారు. శిక్షకుడు అతికష్టమ్మీద ఆ చిన్నారిని సింహం పిల్ల నుంచి విడిపించగలిగాడు. ఈ ఘటనలో చిన్నారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ తలకు అక్కడక్కడా కుట్లు పడ్డాయి. 

ఎన్‌క్లోజర్‌లో దూకి బలయ్యాడు..
మన దేశ రాజధాని ఢిల్లీలో 2014లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక్కడి నేషనల్‌ జులాజికల్‌ పార్క్‌ సందర్శనకు వచ్చిన ఓ ఇరవయ్యేళ్ల యువకుడు హఠాత్తుగా పులుల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న ఓ తెల్లపులి కంట పడ్డాడు. ఆ పులి ఓ పదిహేను నిమిషాలు అతనిపై దాడికి దిగలేదు. ఈ లోపు మిగిలిన సందర్శకులు దాన్ని బెదరగొట్టడానికి, దాని దృష్టిని మరల్చడానికీ రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసర డం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అది హఠాత్తుగా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి పంజాతో దాడి చేసి చంపి లాక్కెళ్లింది. పులి దాడికి దిగుతుండగా ఆ యువకుడు నమస్కరిస్తూ ప్రాధేయపడిన వీడియో అప్పట్లో సామా జిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయ్యింది. 

జూ యజమానిపై దాడి.. 
ఇది రెండు వారాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ జూ నిర్వాహకుడు(85).. సందర్శకులకు జూ చూపిస్తుండగా సింహాల ఎన్‌క్లోజర్లో దుర్వాసన రావడం గమనించాడు. వెంటనే పరధ్యానంగా లోపలికి వెళ్లాడు. సమీపంలోనే ఓ సింహం ఉండడం గమనించి గేటు వైపు పరిగెత్తబోయాడు. ఈ లోపలే అతన్ని దొరకబుచ్చుకున్న సింహం..పంజాతో దాడికి దిగి లోపలికి లాక్కెళ్లింది. ఇంతలో సందర్శకుల్లో ఎవరో తుపాకీతో సింహాన్ని కాల్చడంతో ఆ జూ నిర్వాహకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 

తీసుకోవాల్సిన జాగ్రతలు: 

  • జూ, అడవుల సందర్శనకు వెళ్లినపుడు అక్కడి సిబ్బంది చెప్పే సలహాలు, సూచనలు తప్పక పాటించాలి.
  • క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లడం, వాటితో సెల్ఫీలు దిగాలనుకోవడం ప్రమాదకరం.
  • అడవి జంతువులను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. 
  • సింహాలు, పులులు లాంటి క్రూర జంతువులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌లోకి వెళ్లకూడదు. 
  • జంతువులకు చేత్తో ఆహారపదార్థాలు తినిపించేందుకు ప్రయత్నించకూడదు. 
  • జంతువులను భయపెట్టేలా శబ్దాలు చేయకూడదు. పాటలు పెట్టకూడదు. 
  • చిన్నపిల్లలను ఒంటరిగా వదలి వెళ్లకూడదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement