ఇక ఇరాన్‌పై దృష్టి: ట్రంప్‌

 focus on Iran - Sakshi

ఆంక్షలు అమల్లోకి వచ్చాక చర్చలు జరుగుతాయని ఆశాభావం

సింగపూర్‌: ఉ.కొరియాతో శాంతి చర్చలు సఫలంకావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై దృష్టి సారించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఇరాన్‌–ఆరు అగ్ర దేశాల మధ్య 2015లో కుదిరిన అణు నిరోధక ఒప్పందం నుంచి అమెరికా ఇటీవలే వైదొలిగిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో మంగళవారం కిమ్‌తో భేటీ ముగిసిన తరువాత ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..ఇరాన్‌తో సరికొత్త, వాస్తవిక ఒప్పందం కుదర్చుకోవాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు.

అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చాక ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ ఇరాన్‌తో ఇప్పుడే చర్చలు జరపడం తొందరపాటు అవుతుంది. ఆంక్షలు అమల్లోకి వచ్చాక ఆ ప్రభావంతో తగిన సమయంలో వారే చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. గత నాలుగు నెలల కాలంలో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చింది. వాళ్లు గతంలో మాదిరిగా సిరియాకు మద్దతుగా నిలవడంలేదని అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ల ఆత్మ విశ్వాసం తగ్గింది’ అని ట్రంప్‌ అన్నారు.

2015 నాటి ఒప్పందం ప్రకారం..ఆర్థిక ఆంక్షల ఎత్తివేతకు బదులుగా ఇరాన్‌ తన అణు కార్యకలాపాలను నియంత్రించుకోవడంతో పాటు అంతర్జాతీయ పరిశీలకులను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది. ఆ ఒప్పందానికి కాలం చెల్లిందంటూ అమెరికా వైదొలిగింది. మరోవైపు, ఇచ్చిన మాటకు కట్టుబడని అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తేలేదని ఇరాన్‌ స్పష్టంచేసింది. ఎక్కడ నిలిపివేశామో మళ్లీ అక్కడి నుంచే అణు కార్యక్రమాలు ప్రారంభిస్తామని హెచ్చరించడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top