టర్కీలో పెళ్లి వేడుకపై ఉగ్ర పంజా | Fierce claw wedding ceremony in Turkey | Sakshi
Sakshi News home page

టర్కీలో పెళ్లి వేడుకపై ఉగ్ర పంజా

Aug 22 2016 2:28 AM | Updated on Nov 6 2018 8:04 PM

టర్కీలో పెళ్లి వేడుకపై ఉగ్ర పంజా - Sakshi

టర్కీలో పెళ్లి వేడుకపై ఉగ్ర పంజా

టర్కీలో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ పంజా విసిరింది.

51 మంది మృతి..  70 మందికి గాయాలు
- ఆత్మాహుతి దాడికి పాల్పడిన 12 ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది
 
 ఇస్తాంబుల్ : టర్కీలో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ పంజా విసిరింది. ఉగ్రవాదిగా మారిన 12 ఏళ్ల బాలుడు ఓ పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 51 మంది మృత్యువాతపడగా.. 70 మందికిపైగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున సిరియా సరిహద్దులకు సమీపంలో టర్కీకి దక్షిణాన ఉన్న గజియాన్టెప్ నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం స్పందిస్తూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నట్టు ఆరోపించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాది వయసు 12 ఏళ్లు ఉండొచ్చని చెప్పారు.

పెళ్లికి వచ్చిన అతిథులు ముఖ్యంగా కుర్దులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. పెళ్లి వేడుక సందర్భంగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 51 మంది మృత్యువాత పడ్డారని, మరో 70 మంది గాయాలపాలయ్యాయని వీరిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. టర్కీలో తిరుగుబాటుకు ప్రయత్నించిన అమెరికాకు చెందిన ఫెతుల్లాహ్ గులెన్ ఉగ్రవాద సంస్థ(ఎఫ్‌ఈటీఓ)కు.. నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఐసిస్, కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) లకు పెద్ద వ్యత్యాసం లేదని ఎర్డోగాన్ చెప్పారు. తమపై దాడికి తెగబడిన వారికి తాము ఇచ్చే సందేశం ఒక్కటే అని ‘మీరు ఎప్పటికీ విజయవంతం కాలేరు’ అని స్పష్టం చేశారు.  రక్త దాహానికి అలవాటుపడిన ఉగ్రవాద సంస్థలు, వాటి వెనుక ఉన్న శక్తులు తమ దేశంలో చిచ్చుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. ఈ ఉగ్రవాద దాడిని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. టర్కీకి తమ మద్దతు కొనసాగిస్తామని, ఉగ్రవాదులపై  పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
 
 భారత్‌లోకి ఎఫ్‌ఈటీఓ చొరబడింది: టర్కీ
 న్యూఢిల్లీ: తమ దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నించిన ఫెతుల్లాహ్ గులెన్ ఉగ్రవాద సంస్థ(ఎఫ్‌ఈటీఓ) భారత్‌లోకి చొరబడిందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావుసోగ్లు హెచ్చరించారు. ఎఫ్‌ఈటీఓకు ప్రపంచవ్యాప్తంగా రహస్య నెట్‌వర్క్ ఉందని, అది ఇప్పుడు కొన్ని సంస్థలు, స్కూళ్ల ద్వారా భారత్‌లోకి కూడా చొరబడిందని వెల్లడించారు. ఎఫ్‌ఈటీఓను కూకటివేళ్లతో పెకలించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కావుసోగ్లు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ.. సున్నితమైన ఈ అంశంపై భారత భద్రతా ఏజెన్సీలు దృష్టి సారిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement