సముద్ర వీరుల ప్రపంచ రికార్డు

Feedback Madagascar: Heroes of Atlantic Ocean Rowing Record - Sakshi

అట్లాంటిక్‌ సముద్రంలో ఆ రూటు అత్యంత ప్రమాదకరమైనది. జలాలు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసి పడుతుంటాయి. తుపాన్లు తరచుగా వస్తుంటాయి. పెద్ద పెద్ద సొరచేపలు ఆవురావురుమంటూ నరమాంసం కోసం తిరుగుతూ ఉంటాయి. చిన్న మర పడవలను కూడా బోల్తా కొట్టేంచే శక్తి వాటి సొంతం. ఆకాశాన చుక్కలు కూడా లేని చిమ్మ చీకటిలో అణు క్షణం ఈ ప్రమాదాలు ఎదుర్కొవాలి. అదే రూటులో తరచుగా వచ్చే పెద్ద సరకు రవాణా ఓడల బారిన పడకుండా తప్పించుకోవాలి. మర పడవ కాకుండా రోయింగ్‌ పడవలో ప్రయాణం చేయడమంటే సాహసం చేయడం కాదు, ప్రాణాలను పణంగా పెట్టడం. తెడ్ల వేసుకుంటూ మూడువేల మైళ్లు ప్రయాణించడమంటే మృత్యువుతో పందెం వేసుకోవడమే!

అలా ముగ్గురు సోదరులు ఎవాన్‌ 27, జమీ 26, లచ్లాన్‌ 21 కలిసి డిసెంబర్‌ 12వ తేదీన ఈ సాహసానికి ఒడిగట్టారు. దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువైన 28 అడుగుల రోయింగ్‌ (తెడ్లతో నడిపే) పడవలో అట్లాంటిక్‌ సముద్రంలో కానరీ దీవుల్లోని లా గొమెరా నుంచి మూడు వేల మైళ్ల దూరంలోని కరీబియన్‌లోని ఆంటిగ్వా నెల్సన్స్‌ హార్బర్‌కు గురువారం చేరుకున్నారు. ఇందుకు వారికి సరిగ్గా 35 రోజుల, తొమ్మిది గంటల, తొమ్మిది నిమిషాలు పట్టింది. ముగ్గురు సోదరులకు ప్రయాణంలో ‘సీ సిక్‌నెస్‌’ వచ్చింది. ఒంటి నిండా కురుపులు, దద్దులు లేచాయి. వాటికి ఎప్పటికప్పుడు యాంటీ బయాటిక్స్‌ పూసుకుంటూ, నిద్రలేమి రాత్రులు గడుపుతూ వారు ఈ సాహసాన్ని పూర్తి చేశారు. 

ఏ సాహసం చేయాలన్నా అందుకు ఓ లక్ష్యం ఉండాలి. అందుకని ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూనే ప్రపంచంలో దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ‘ఫీడ్‌బ్యాక్‌ మడగాస్కర్‌’తో పాటు ‘చిల్డ్రన్‌ ఫస్ట్‌’ చారిటీ సంస్థకు రెండున్నర కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్జించేందుకు వారు కొత్త ప్రపంచ రికార్డును సష్టించారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టలేదట. స్వతహాగా అన్నదమ్ములం అవడం వల్ల ఆ అనుబంధం, పరస్పర స్ఫూర్తితో ఈ విజయాన్ని సాధించామని, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని వారు తమదైన శైలిలో చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top