నిశ్శబ్దంగా చంపేశారు

Donald Trump vows to send beautiful equipment if Iran attacks - Sakshi

జనరల్‌ సులేమానీపై ఆపరేషన్‌ జరిగింది ఇలా..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాకి పక్కలో బల్లెంలా మారిన జనరల్‌ సులేమానీని చంపేయడానికి పెంటగాన్‌ ప్రణాళిక ప్రకారం రహస్య ఆపరేషన్‌ చేపట్టింది. ఇందుకోసం ఏ మాత్రం చప్పుడు చేయకుండా శత్రువుని అంతం చేసే క్షిపణిని, ఎంతదూరమైనా ప్రయాణించే సత్తా కలిగిన డ్రోన్‌ని వినియోగించినట్టుగా అమెరికా, అరబ్‌ దేశాల ప్రధాన మీడియా కథనాలు రాస్తోంది. ఆపరేషన్‌పై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ అనేక విశ్లేషణలు బయటకొస్తున్నాయి. జనరల్‌ సులేమానీ ఇరాక్‌కు వచ్చినప్పుడు రక్షణపరంగా అంతగా జాగ్రత్తలు తీసుకునేవారు కాదు.

ఎందుకంటే ఆ ప్రాంతం అత్యంత సురక్షితమని ఆయన నమ్మేవారు. సరిగ్గా దానినే అమెరికా అనువుగా మార్చుకుంది. ఇజ్రాయెల్, అమెరికా నిఘా విభాగం సులేమానీ కదలికల్ని అనుక్షణం గమనిస్తూ ఆయన్ను ఇరాక్‌లో ఉన్నప్పుడే చంపేయాలని  వ్యూహం పన్నింది. అమెరికా తన వద్ద ఉన్న అత్యంత భయంకరమైన డ్రోన్‌ను ముందుగానే కువైట్‌కు పంపింది. సులేమానీ  బాగ్దాద్‌కు వస్తున్న విషయాన్ని తెలుసుకుని ఈ డ్రోన్‌ని బాగ్దాద్‌ గగనతలానికి తరలించింది.  ఇరాక్‌లో మిగిలిన ప్రాంతంలో విధ్వంసం జరగకూడదన్న ఉద్దేశంతో విమానా శ్రయం వద్దే డ్రోన్‌ దాడికి ట్రంప్‌ ఆదేశించినట్టుగా కథనాలు వచ్చాయి.

సైలెంట్‌ కిల్లర్‌ ఆర్‌9ఎక్స్‌
డ్రోన్‌ సాయంతో ప్రయోగించే క్షిపణి హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌. ఉగ్రవాద సంస్థల నాయకుల్ని మట్టుబెట్టడానికే ఈ క్షిపణిని అమెరికా వినియోగిస్తోంది. ఈ క్షిపణికి కచ్చితత్వం చాలా ఎక్కువ. దీనికున్న ఆరు పాప్‌ అప్‌ బ్లేడ్స్‌ వల్ల క్షిపణి ప్రయోగం జరిగిన ప్రాంతంలోనే «విద్వంసం జరుగుతుంది. నిశ్శబ్దంగా పనిచేయడం దీని ప్రత్యేకత.  అల్‌ఖాయిదా నేత అబు ఖయ్యార్‌ అల్‌ మస్రీని హతం చేయడానికి ఈ క్షిపణినే ప్రయోగించింది.  

ఆ డ్రోన్‌ అత్యంత భయంకరమైనది  
ఇక ఆపరేషన్‌లో అత్యంత భయంకరమైన డ్రోన్‌ యూఎస్‌ ఎంక్యూ–9 రీపర్‌ వినియోగించింది. ఈ డ్రోన్‌ గంటకి 480కి.మీ.వేగంతో ప్రయాణించగలదు. 1800కి.మీ. దూరం నుంచి లక్ష్యాలను ఛేదించగలదు. సుదూర ప్రాంతాల్లో ఏమున్నా పసిగట్టే సెన్సర్లు, వివిధ రకాలుగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ, కచ్చితత్వంతో లక్ష్యాలను తాకే ఆయుధాలు, ఒకేసారి బహుళ లక్ష్యాలను నిర్వహించే సామర్థ్యం ఈ డ్రోన్‌కి ఉంది. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లకు ఇది అనువైంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top