ఆ దేశాల కంటే మేమే ముందున్నాం: ట్రంప్‌

Donald Trump Says US Doing A Great Job Carried Out More Covid 19 Tests - Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నిర్ధారణ పరీక్షల్లో అన్ని దేశాల కంటే అమెరికా ముందు ఉన్నదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 4.18 మిలియన్‌ మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తద్వారా కరోనాపై పోరులో తాము ప్రపంచ రికార్డు నెలకొల్పామని పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌...‘‘ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డం, దక్షిణ కొరియా, జపాన్‌, సింగపూర్‌, భారత్‌, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్‌, కెనడా తదితర పది దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక మందికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాం. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండకపోతే ఇప్పటికే లక్షలాది మంది మరణించేవారు. మహమ్మారిపై పోరులో మేము ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాం. దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నాం. ఈ పోరాటంలో మాకు అండగా నిలుస్తున్న అమెరికా పౌరులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. (వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ రాలేదు: చైనా)

ఇక అగ్రరాజ్యంలో కరోనా మరణాలు 40 వేలు దాటగా... 7,64,000ల మంది అంటువ్యాధి బారిన పడ్డారు. ఇదిలా ఉండగా.. అమెరికా కోవిడ్‌ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్న న్యూయార్క్‌లో దాదాపు 17 వేల మంది మృత్యువాత పడగా... 2,42,000 మందికి కరోనా సోకింది. అయితే గత వారం రోజులుగా అక్కడ కరోనా కేసుల సంఖ్యలో 50 శాతం తగ్గుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా సీటెల్‌, డెట్రాయిట్‌, న్యూ ఓర్లాండ్స్‌, ఇండియానా పోలిస్‌, హైస్టన్‌ తదితర ప్రాంతాల్లోనూ కరోనా నెమ్మదించినట్లు సమాచారం.

ఈ పరిణామాలపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్‌... ‘‘చాలా అద్భుతమైన విషయం ఇది. కరోనా కేసుల గ్రాఫ్‌ తగ్గుదల ఎంతో అందంగా కనిపిస్తోంది. అమెరికాలో లక్ష కోవిడ్‌ మరణాలు సంభవిస్తాయని అంచనా వేశాం. అయితే ఇప్పుడు 60 వేల మార్కు వద్ద ఆగిపోతామనే నమ్మకం ఉంది. ఇది ఫ్లూ లాంటిదే. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. మనం దేన్నీ మూసివేయబోవడం లేదు. అయితే అందంగా... పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు. (వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీకైంది...)

అదే విధంగా కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తన పాలనా యంత్రాగంపై ప్రశంసలు కురిపించిన ట్రంప్‌.. ‘‘ఒకరిద్దరు విమర్శించే వాళ్లు ఉంటారు. మనం ఎంతగా కష్టపడినా వారిని సంతృప్తిపరచలేం. కరోనాను తరిమికొట్టిన తర్వాత కూడా ఏదో ఒక అంశంలో వారు మనపై బురదజల్లాలని చూస్తారు’’ అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఇక  ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే (సరిహద్దులు మూసివేయకుండా) ఈ పరిస్థితి తలెత్తిందని... ఇందుకు ఆ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.(వూహాన్‌లో ఏం జరిగింది?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top