వూహాన్‌లో ఏం జరిగింది?

Wuhan lab at the center of the coronavirus controversy - Sakshi

ల్యాబ్‌ నుంచి లీకయిందని అమెరికా మీడియా కథనాలు 

సమగ్ర విచారణ జరుపుతామంటున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్‌ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనా లోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి ఈ వైరస్‌ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అధ్యక్షుడు ప్రకటించారు.  

వూహాన్‌ మార్కెట్‌లో ఆ గబ్బిలాలు లేవా ?  
కరోనా వైరస్‌ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్‌ వెట్‌ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్‌ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్‌ సోకిన మొట్టమొదటి పేషెంట్‌ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే  కరోనా సోకిందని చెబుతోంది.

ల్యాబ్‌లో భద్రత కరువు?
వూహాన్‌లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్‌ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది. చైనాలో అమెరికా దౌత్యవేత్తలు అందించిన సమాచారం ప్రకారం 2018లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పలుమార్లు వూహాన్‌లో వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించారు. అక్కడ సరైన భద్రత ఏర్పాట్లు లేవని, గబ్బిలాల్లో వైరస్‌కు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిశోధనల సమయంలో సార్స్‌ వంటి వైరస్‌లు బయటకు లీకయ్యే అవకాశాలు ఉన్నాయని రెండేళ్ల క్రితమే అమెరికా ప్రభుత్వాన్ని శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టుగా తన కథనంలో పేర్కొంది.

ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు?  
వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్‌. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్‌ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్‌ మార్కెట్‌ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్‌ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి.

పీ4 ల్యాబొరేటరీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top