మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్‌

Donald Trump Offers To Mediate In South China Sea Dispute - Sakshi

మనీలా: దక్షిణ చైనా సముద్రంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. వియత్నాం అధ్యక్షుడు త్రాన్‌ దై క్వాంగ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తానొక మంచి మధ్యవర్తినని, సంబంధిత పక్షాలు కోరితే మధ్యవర్తిత్వానికి తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏర్పాటుచేస్తున్న సైనిక స్థావరాలు, కృత్రిమ ద్వీపాల్ని గత కొంతకాలంగా వియత్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో మొదటి నుంచి వియత్నాంకు అమెరికా మద్దతుగా ఉంది. వియత్నాంతో పాటు ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్‌లతో కూడా దక్షిణ చైనా సముద్రం విషయమై చైనాకు గొడవలున్నాయి.

పరిష్కరించుకుంటాం: వియత్నాం
మరోవైపు ట్రంప్‌ వియత్నాం పర్యటన ముగించుకుని ఫిలిప్పీన్స్‌ చేరగానే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వియత్నాంలో అడుగుపెట్టారు. ఆయనకు వియత్నాం ఘనస్వాగతం పలికింది. జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా.. ఇరు దేశాధినేతలు ఆర్థిక సంబంధాల్ని విస్తృతం చేసుకోవడంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న వివాదం పరిష్కారం దిశగా చర్చలు జరపనున్నారు. శాంతియుత మార్గంలో దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న విభేదాల్ని పరిష్కరించుకుంటామని వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్‌ పేర్కొన్నారు.

కిమ్‌ పొట్టి, లావు అని అన్నానా?: ట్రంప్‌  
ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. కిమ్‌ తనను ముసలివాడు అనడంపై ట్విటర్‌లో ట్రంప్‌ మండిపడ్డారు. ‘నన్ను ముసలివాడు అంటూ కిమ్‌ ఎందుకు అవమానిస్తున్నాడు. నేనెప్పుడైనా అతన్ని పొట్టి, లావు అన్నానా?’ అని ఎగతాళిగా ట్వీట్‌ చేశారు. కిమ్‌కు స్నేహితుడిగా ఉండేందుకు తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, ఏదొక రోజు అది జరగవచ్చేమో? అని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top