
భారత యాసను వెక్కిరించిన ట్రంప్
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతూ అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సారి భారతీయ ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు.
అమెరికా ఉద్యోగాల్ని లాక్కుంటున్నారని ఆక్రోశం
వాషింగ్టన్: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతూ అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సారి భారతీయ ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు. నకిలీ భారతీయ ఇంగ్లిష్ యాసలో మన దేశానికి చెందిన కాల్‌సెంటర్ ఉద్యోగిని వెక్కిరిస్తూ డెలావేర్ సభలో ట్రంప్ మాట్లాడారు. తన క్రెడిట్ కార్డ్ కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ విభాగం అమెరికాలో ఉందా..? విదేశంలో పనిచేస్తుందో తెలుసుకునేందుకు గతంలో చేసిన ఫోన్‌కాల్ వివరాల్ని ప్రస్తావించారు. కార్డు వివరాలు తెలుసుకునే కారణంతో ఫోన్ చేసి కస్టమర్ కేర్ ప్రతినిధిని ‘నువ్వు ఎక్కడి వాడివి’ అని ప్రశ్నించానని చెప్పారు.
ఉద్యోగి సమాధానాన్ని భారతీయ యాసలో వెకిలిగా ఉచ్చరిస్తూ... ‘నేను భారత్ నుంచి’ అని సమాధానం వచ్చిందని ట్రంప్ చెప్పారు. ‘చాలా మంచిది, అద్భుతం’ అంటూ ఫోన్ పెట్టేశానన్నారు. భారత్ తదితర దేశాలు అమెరికా ఉద్యోగాలు లాక్కుంటున్నాయన్నారు. దీన్ని ప్రోత్సహించొద్దన్నారు. ‘భారత్ అద్భుత దేశం. ఆ దేశ నేతల గురించి బాధపడడం లేదు. మన నేతల విధానాలతోనే ఆందోళన చెందుతున్నా. నాకు చైనా, ఇండియాలపై కోపం లేదు’ అని చెప్పారు. అమెరికా బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ పరిశ్రమకు డెలావేర్ కేంద్రం.