ఫేస్‌బుక్‌లో నేను ఫస్ట్‌.. మోదీ సెకండ్‌: ట్రంప్‌

Donald Trump: Iam First, Narendra Modi Second on Facebook - Sakshi

మరోసారి చెప్పుకున్న ట్రంప్‌

కాదంటున్న ఫేస్‌బుక్‌ గణాంకాలు

భారత జనాభాను కూడా తప్పుగా చెప్పిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’లో ఫాలోవర్ల పరంగా తాను ప్రథమ స్థానంలో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చెప్పుకున్నారు. రెండో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారన్నారు. ఆయా దేశాల జనాభాను ప్రస్తావిస్తూ.. 150 కోట్లమంది భారతీయులుండటం మోదీకి సానుకూలంగా మారిందని వ్యాఖ్యానించారు. అమెరికా జనాభా 35 కోట్లేనన్నారు. లాస్‌వేగాస్‌లో గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మధ్య ఫేస్‌బుక్‌ చీఫ్‌ జుకర్‌బర్గ్‌ నన్ను కలిశారు. అభినందనలు తెలిపారు. ఎందుకని ప్రశ్నించా. ఫేస్‌బుక్‌లో మీరే నెంబర్‌వన్‌ అన్నారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్విటర్‌లో కూడా నేనే నెంబర్‌వన్‌ అని చెప్పారు. ఈ విషయం భారత ప్రధాని మోదీతో కూడా చెప్పానన్నారు.

‘వచ్చేవారం భారత్‌ వెళ్తున్నా. వారి జనాభా 150 కోట్లు. ఆ దేశ ప్రధాని ఫేస్‌బుక్‌లో రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్నదెవరో తెలుసా? ట్రంప్‌. మీరు నమ్ముతారా? నెంబర్‌వన్‌ ట్రంప్‌’ అని ప్రేక్షకుల నవ్వుల మధ్య ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇది అబద్ధం కాదు.. అబద్దమైతే మీడియాకు బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది కదా అని చమత్కరించారు. భారత ప్రధాని మోదీతో సంభాషణను కూడా ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ‘ఫేస్‌బుక్‌లో రెండో స్థానంలో ఉండటంపై మోదీని అభినందించాను. మీ జనాభా 150 కోట్లు. మీరు రెండో స్థానంలో ఉన్నారు. మా జనాభా 35 కోట్లు. నేను ప్రథమ స్థానంలో ఉన్నాను అని ఆయనతో చెప్పాను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఫేస్‌బుక్‌లో నెంబర్‌ 1గా ఉన్నానంటూ ట్రంప్‌ చెప్పుకున్నారు. కాగా, అధికారిక లెక్కల ప్రకారం భారత జనాభా సుమారు 130 కోట్లు. అలాగే, ఫేస్‌బుక్‌ లెక్కల ప్రకారం, శుక్రవారం నాటికి ప్రధాని ఫేస్‌బుక్‌లో మోదీని అనుసరిస్తున్నవారి సంఖ్య 4.4 కోట్లు. కాగా, ట్రంప్‌ ఫాలోవర్ల సంఖ్య 2.7 కోట్లు. (చదవండి: దక్షిణ కొరియా సినిమాకు ఆస్కారా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top