కుక్క విశ్వాసంపై మరో వీడియో వైరల్‌

Dog Refuses To Leave Its Owner When She Unconscious - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనిషి పట్ల మనిషికి లేని అత్యంత విశ్వాసం కలిగిన పెంపుడు జంతువేది అంటే ఎవరైనా కుక్క అని తేలిగ్గా చెప్పేస్తారు. యజమాని పట్ల కుక్క కుండే విశ్వాసానికి సంబంధించి అనేక సంఘటనలు, అనేకసార్లు చూసే ఉంటాం. మనం తేలిగ్గా చెబుతాంగానీ అవి యజమానికి ఏమైనా అయితే ఎంత భారంగా ఫీలవుతాయో, ఎంతగా ఆరాట పడతాయో తెలియజేసే మరో సంఘటన చైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చైనాలోని హైలాంగ్‌జియాంగ్‌ రాష్ట్రంలోని దాకింగ్‌ నగరంలో హఠాత్తుగా ఓ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఓ అంబులెన్స్‌ వచ్చి ఆమెను స్ట్రెచర్‌ మీద ఎక్కించుకుంది. ఆమె వెంట వచ్చిన కుక్క ఆమెను వదిలిపెట్టకుండా స్ట్రెచర్‌పై చేతులేసి యజమానురాలిని లేపేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ యజమానురాలు కొద్దిగా స్పృహలోకి రావడంతో ఆమెను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అంబులెన్స్‌ సిబ్బంది, అంబులెన్స్‌లోకి ఆ కుక్కను కూడా అనుమతించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రి వరకు వెన్నంటి వచ్చిన ఆ కుక్క తన యజమానురాలికి చికిత్స సమయంలో కూడా పక్కనే ఉంది. ఆ యజమానురాలు పూర్తిగా స్పహలోకి రాగానే ఆ కుక్కను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుంది.

ఆ యజమానురాలి పేరు, ఇతర వివరాలు తెలియవుగానీ కుక్క మాత్రం గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందినది. తాము అసలు పెంపుడు జంతువులను ఆస్పత్రిలోకి అనుమతించమని, అయితే ఇక్కడ పేషంట్‌ను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని, అందుకు సహకరిస్తున్న కుక్కను చూసి అనుమతించామని ‘జాంగ్‌ జియాంగ్‌’ ఆస్పత్రి హెడ్‌ నర్సు ప్రకటించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top