వారిలో ఎక్కువ మంది ట్రంప్‌కు వ్యతిరేకమే..!

Democratic Party Will Work Against Trump Policies - Sakshi

అమెరికాలో డెమోక్రాట్లు ఏ చేయబోతున్నారు..?

ప్రతినిధుల సభలో పట్టు బిగించిన డెమోక్రాట్లు

కాంగ్రెస్‌లోకి 100మందికిపైగా మహిళలు

అమెరికాయేతరుల ఓట్లు డెమోక్రాట్లకే

అమెరికా చట్ట సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, సెనెట్‌లో రిపబ్లికన్లు మెజారీటీ సాధించారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం ట్రంప్‌ దూకుడుకు కళ్లెం వేస్తుందని ట్రంప్‌ వ్యక్తిగత అంశాలపై, ఆయన పాలనపై జరుగుతున్న దర్యాప్తులు ఊపందుకుంటాయని విశ్లేషకుల అంచనా. ట్రంప్‌ తన విధానాలను, నిర్ణయాలను పునఃపరిశీలించుకోవలసిన అవసరం ఉంటుందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 100 మందికిపైగా మహిళలు ఎన్నిక కావడం విశేషం. మధ్యంతర ఎన్నికలు అమెరికా ప్రజల్ని ట్రంప్‌ అనుకూలురు, ట్రంప్‌ వ్యతిరేకులుగా విభజించాయనీ, దీని ఫలితం దేశ రాజకీయాల్లో మరో రెండేళ్ల వరకు ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మధ్యంతర ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఇంత వరకు వచ్చిన ఫలితాలను బట్టి ప్రతినిధుల సభ డెమోక్రాట్ల పట్టులోకి వెళ్లిందని స్పష్టమవుతోంది. ప్రతినిధుల సభలో మెజారిటీ కంటే 30 సీట్లు అధికంగా డెమోక్రాట్లు గెలుచుకున్నారు. 2006 తర్వాత డెమోక్రాట్లకు ఇంత మెజారిటీ రావడం ఇదే తొలిసారి. డెమోక్రాట్ల తరఫున ఎన్నికైన వారిలో చాలా మంది మొదటి సారి ప్రజాప్రతినిధులయిన వారే.

ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించడం వల్ల ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ పాల్పడిన అవకతవకలు, ఎన్నికల్లో రష్యా జోక్యం, అలాగే.. ఆయన వివాదాస్పద నిర్ణయాలు, పాలన తీరుపై విచారణలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రతినిధుల సభ, సెనెట్‌ రెండింటిలో మెజారిటీ సభ్యుల ఆమోదం అవసరం. సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్నందున డెమోక్రాట్ల పని అనుకున్నంత సులభం కాదు. కాగా, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జనవరిలో జరుగుతుంది కాబట్టి ఇదంతా కార్యరూపం దాల్చడానికి కొన్ని నెలలు పడుతుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు వివిధ అంశాలపై దృష్టి సారించనున్నారు.

అభిశంసన
సభలో మెజారిటీ ఉన్నందున డెమోక్రాట్‌ పార్టీకి మరింత నగదు అందుబాటులో ఉంటుంది. సిబ్బంది పెరుగుతారు. సభా సంఘాలపై నియంత్రణ వస్తుంది. దాంతో ట్రంప్‌కు సంబంధించిన వివిధ కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. అలాగే, ట్రంప్‌ అభిశంసనకు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అభిశంసన అంత సులభం కాకపోవచ్చు. ప్రతినిధుల సభ అభిశంసన ప్రక్రియను ప్రారంభించవచ్చు. కానీ, రెండు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే ఈ తీర్మానం చెల్లుతుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నప్పటికీ చాలా మంది డెమోక్రాట్లు ట్రంప్‌ ఎన్నికల అక్రమాలపై జరుగుతున్న విచారణ తేలేంత వరకు అభిశంసనకు ముందుకు రాకపోవచ్చు. మరోవైపు సెనెట్‌లో మూడింట రెండు వంతుల బలం డెమోక్రాట్లకు లేదు. కాబట్టి అక్కడ తీర్మానం నెగ్గే అవకాశం లేదు.

బడ్జెట్‌
ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు బడ్జెట్‌ విషయంలో ట్రంప్‌కు కళ్లెం వేసే అవకాశం ఉంది. ఇప్పటిలా ట్రంప్‌ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్‌కు సంబంధించిన వివిధ అంశాల్లో ట్రంప్‌ మాట చెల్లుబాటయ్యే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు.

పన్ను రిటర్న్‌లు
ట్రంప్‌ వ్యక్తిగత ఆదాయం, పన్ను రిటర్న్స్‌ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తారు. గతంలో వీటిని ఇవ్వడానికి ట్రంప్‌ నిరాకరించారు. అయితే, ఈసారి ట్రంప్‌ను రిటర్న్స్‌ పత్రాల కోసం అడుగుతామనీ, ఆయన నిరాకరిస్తే తమకున్న అధికారంలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్‌ వేస్‌ అండ్‌ మీన్స్‌ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్‌ నీల్‌ చెప్పారు. ఆయన బ్యాంకు లావాదేవీల వివరాలు కూడా సంపాదిస్తామన్నారు. ఇవి బయటపడితే ట్రంప్‌కు రష్యాతో ఉన్న సంబంధాలు బయటపడతాయని ఆయన అన్నారు. అయితే, వీటికోసం న్యాయపరంగా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుంది.

రష్యా జోక్యం
గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, ట్రంప్‌ విజయానికి రష్యా సహకరించిందని వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మళ్లీ విచారణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పుడీ పునర్విచారణ  ప్రారంభమైతే ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరగవచ్చు.

మెక్సికో సరిహద్దులో గోడ
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ఈ అంశాన్ని కీలకం  చేసుకుని లబ్ధి పొందారు. అక్రమ వలసలను అరికట్టడానికి మెక్సికో సరిహద్దు పొడవునా గోడ కడతానని చెప్పారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ గత మార్చిలో దానికి 160 కోట్ల డాలర్లను కూడా  కేటాయించింది. అప్పట్లో డెమోక్రాట్లు సహా పలువురు దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడీ గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు  డెమోక్రాట్లు చర్యలు తీసుకోవచ్చు.

ఒబామా కేర్‌
మధ్యంతర ఎన్నికల్లో ప్రభావం చూసిన అంశాల్లో ఇమ్మిగ్రేషన్, హెల్త్‌కేర్‌ ముఖ్యమైనవి. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగిస్తామని డెమోక్రాట్లు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఉంది. అలాగే, వలస విధానాల్లో ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న సవరణలు, తెస్తున్న కొత్త నిబంధనలపై కూడా డెమోక్రాట్లు దృష్టి సారించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మెడికేర్, మెడిక్‌ ఎయిడ్‌ పథకాల కొనసాగింపునకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అనంతరం డెమోక్రాట్ల నేత నాన్సీ పిలోసి చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాల కింద వైద్య సహాయం అందిస్తారు. ఔషధాల ధరల్ని తగ్గిస్తామని, ఆరోగ్యబీమా ప్రీమియం తగ్గిస్తామని  కూడా డెమోక్రాట్లు చెబుతున్నారు.

ఇరాన్‌తో ఒప్పందం
ఒబామా హయాంలో అమెరికా –ఇరాన్‌ల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్‌ వైదొలగడం పట్ల డెమోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడీ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని డెమోక్రాట్లు భావిస్తున్నా, సెనెట్‌లో మెజారిటీ లేనందున చేయగలిగిందేమీ ఉండదని తెలుస్తోంది. అలాగే, ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంపై కూడా వీరు దృష్టి సారించే అవకాశం ఉంది.

ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించడంతో పలు ప్రభుత్వ కమిటీలు, విచారణ సంఘాలకు డెమోక్రాట్‌ నేతలే నాయకత్వం వహిస్తారు. దాంతో ఈ కమిటీలు ట్రంప్‌ పాలనపైన, వ్యక్తిగతంగాను శూలశోధనకు దిగే అవకాశం ఉంది.

రెండుగా చీలిన అమెరికన్లు
మధ్యంత ఎన్నికలు ట్రంప్‌ పాలనపై రెఫరెండమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికలతో ట్రంప్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా అమెరికన్లు విడిపోయారని , దీని ప్రభావం వచ్చే రెండేళ్ల పాటు అమెరికా రాజకీయాలపై ఉంటుందని వారు తెలిపారు. ఈ ఎన్నికలతో అమెరికా వాణిజ్యయుద్ధం మరింత ముదురుతుందని, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం అవుతుందని పరిశీలకుల భావన. అలాగే, ఈ ఎన్నికల్లో వంద మందికి పైగా మహిళలు నెగ్గడంతో సంప్రదాయక వాదులైన డెమోక్రాట్లు తమ అజెండాను సవరించుకోవలసి ఉంటుందన్నారు.

పురుషుల ఓట్లు ట్రంప్‌కే
మధ్యంతర ఎన్నికల్లో 60శాతం పురుషుల ఓట్లు రిపబ్లికన్‌ పార్టీకి పడ్డాయని, మహిళల ఓట్లు రెండు పార్టీలకు పడ్డాయని ఎన్నికల సర్వేలు వెల్లడిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో 49శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 18–24 ఏళ్ల మధ్య వయస్కుల్లో 68శాతం మంది డెమోక్రట్‌పార్టీకి ఓటు వేశారు. వృద్ధ ఓటర్లు ఎక్కువగా రిపబ్లికన్‌ అభ్యర్ధులకు ఓటు వేశారు. అమెరికాయేతర ఓటర్లు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది డెమోక్రాట్‌ పార్టీకి ఓటు వేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top