చైనాపై లోతైన దర్యాప్తు

Deep Investigation Will Be Done On China Says Donald Trump - Sakshi

భారీ నష్ట పరిహారం కోరతాం

కరోనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ పుట్టినిల్లు అయిన చైనాపై తాము లోతుగా విచారణ జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. వైరస్‌ కారణంగా జరిగిన నష్టానికి జర్మనీ కోరుతున్న 130 బిలియన్‌ యూరోల పరిహారం కంటే ఎక్కువ మొత్తాన్నే ఆ దేశం నుంచి రాబడతామని ఆయన అన్నారు. అయితే, ఎంతమొత్తం అన్నది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సోమవారం ట్రంప్‌ మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయం వెల్లడించారు. కరోనా వైరస్‌కు చైనాదే బాధ్యతనే విషయాన్ని పలు విధాలుగా రుజువు చేయవచ్చుననీ, దీనిపై అమెరికా తీవ్రంగా విచారణ జరుపుతోందని ఆయన తెలిపారు. వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే అమెరికా పార్లమెంట్‌ సభ్యుడు ఎర్ల్‌ ఎల్‌ బడ్డీ సోమవారం వైరస్‌ పుట్టుక, చైనా వ్యవహారశైలిపై జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ నేతృత్వంలో విచారణ జరపాలని ప్రతిపాదించారు. చైనా తొలిదశలోనే వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచంతో పంచుకుని, పారదర్శకంగా వ్యవహరించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేది కాదని అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా నుంచి నష్టపరిహారం కోరాలని పలు దేశాలు ఆలోచిస్తున్నాయి.

కిమ్‌ ఆరోగ్యంపై మాట్లాడలేను 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిని గురించి తనకు సరైన అవగాహన ఉందని, ఆయన చనిపోయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ విషయంపై మాట్లాడలేనని ట్రంప్‌ తెలిపారు. కిమ్‌కు అంతా మేలే జరగాలని కోరుకుంటున్నానన్నారు. త్వరలోనే కిమ్‌ ఆరోగ్య సమాచారం అందరికీ తెలుస్తుందని తెలిపారు.

సకాలంలోనే అధ్యక్ష ఎన్నికలు.. 
కోవిడ్‌–19 నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడవచ్చునన్న వదంతులను ట్రంప్‌ కొట్టివేశారు. అధ్యక్ష ఎన్నికల తేదీ మార్చాలని తాను ఎప్పుడూ ఆలోచించలేదని, నవంబర్‌ 3వ తేదీనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ట్రంప్‌ ఎన్నికల వాయిదాకు ఆలోచిస్తున్నట్లు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ఆరోపించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బిడెన్‌తోపాటు చాలామంది ఇవే ఆరోపణలు చేశారని, అయితే ఎన్నికల వాయిదా యోచనేదీ లేదన్నది వారు తెలుసుకోవాలని ట్రంప్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top