
ప్రతీకాత్మక చిత్రం
మాస్కో : చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పొరుగు దేశం రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసివేయాలని రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ అధికారులను ఆదేశించారు. ఇదే విషయాన్ని మైఖేల్ తన కేబినెట్ సహచరులకు వివరించారు. తమ దేశ ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మరోవైపు చైనీయులకు తమ దేశ ఎలక్ట్రిక్ వీసాలు జారీ చేయడాన్ని తాత్కాలిక నిలిపివేసినట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యా ప్రజలు చైనా ప్రయాణం మానుకోవాలని సూచించింది. అలాగే చైనాలో ఉండే రష్యా దేశస్థులు నిరంతరం ఎంబసీతో టచ్‌లో ఉండాలని కోరింది.
అంతకుముందే రష్యాలో కరోనా వైరస్ ప్రభావం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 15 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మందికిపైగా మరణించారు. ఇప్పటివరకు రష్యాలో ఎవరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కాకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
చదవండి : భారత్‌లోకి ప్రవేశించిన ‘కరోనా’