కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే 

Corona Virus Tests Will Available At Gandhi Hospital Soon - Sakshi

10 రోజుల్లో అందుబాటులోకి.. 

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు కరోనా పరీక్షలు పుణేలో నిర్వహిస్తున్నారు. అక్కడకు రక్తనమూనాలను కొరియర్‌ ద్వారా విమానాల్లో పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు రావడానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ ఇబ్బందులేవీ లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే నిర్వహించాలని వైద్య యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా ఉందని వైద్య అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కరోనా నిర్ధారణ కిట్లను సరఫరా చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఫీవర్‌ ఆసుపత్రిలోనూ చేయడానికి వీలుందని ఈటల పేర్కొంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, దేశంలోని 10 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో గాంధీ ఆసుపత్రి ఉండటం గమనార్హం. 

రెండు సార్లు పరీక్షలు తప్పనిసరి.. 
కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఇక నుంచి 2 సార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రానికి మార్గదర్శకాలు జారీచేసింది. ఒకసారి రక్త పరీక్ష చేశాక అందులో నెగిటివ్‌ వచ్చినా 48 గంటల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీనివల్ల పూర్తిస్థాయిలో కచ్చితత్వం వస్తుందనేది కేంద్రం భావన. ఇప్పటివరకు తెలంగాణలో 10 మంది కరోనా అనుమానంతో ఫీవర్‌ ఆసుపత్రికి వచ్చారు. వారిలో ఐదుగురికి ఎలాంటి లక్షణాల్లేవని నిర్ధారించారు. మరో ఐదుగురి రక్త నమూనాలను పుణేకు పంపించారు. వీరి ఫలితాలు నేడు పుణే నుంచి వస్తాయి. అయితే మొదటి ఐదుగురికి నెగిటివ్‌ వచ్చినా మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ ఐదుగురిలో ముగ్గురు చైనాలోని వుహాన్‌ నుంచి హాంకాంగ్‌ మీదుగా భారత్‌కు వచ్చినట్లు ఫీవర్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top