కరోనా: పురుషుల సంఖ్య 43.. మహిళలు సంఖ్య 23

Coronavirus Kills Men Twice Than Women in New York - Sakshi

న్యూయార్క్‌: మహమ్మారి కరోనా బారిన పడుతున్నవారిలో, మరణాల్లోనూ మహిళలకంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మృతుల సంఖ్య, పాజిటివ్‌ కేసుల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఇక కోవిడ్‌ కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికాలోని అత్యధిక కేసులు నమోదైన న్యూయార్క్‌ నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో మహిళలతో పోల్చితే పురుషులు రెండింతలు ఉంటున్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు 43 మంది పురుషులు మరణిస్తుండగా.. ప్రతి లక్ష మందికి 23 మంది మహిళలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక  నగరంలో కరోనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారిలో సైతం ఇదే పరిస్థితి ఉంది.
(చదవండి: కరోనా పోరు: బీసీజీ టీకాతో భారత్‌కు ఎంతో మేలు!)

అత్యధిక కేసులు, మరణాలు నమోదైన ఇటలీ, చైనాలో కూడా పురుషుల సంఖ్యే అధికంగా ఉంది. అయితే, ప్రవర్తనా, జీవ సంబంధమైన కారణాలతో ఈ తేడా ఉంటోందని పలువురు వైద్య నిపుణులు చెప్తున్నారు. పురుషుల్లో పొగ తాగే అలవాటు అధికంగా ఉండటం ఒక కారణమైతే... సాధారణంగా పునరుత్పత్తి వ్యవస్థ కలిగిన మహిళలకు రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అంటున్నారు. మహిళలకు బీపీ, గుండె జబ్బులు తక్కువే గనుక వారి ఆయుర్ధాయం కూడా ఎక్కువేనని అభిప్రాయపడ్డారు. అయితే, లింగ అసమానతే ఈ అంతరానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.

‘మా వద్దకు వచ్చే కరోనా రోగుల్లో 80 శాతం మంది పురుషులే అని మాత్రం చెప్పగలను’ అని బ్రూక్‌లైన్‌లో ఉన్న మౌంట్‌ సినై హెల్త్‌ సిస్టమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ హనీ స్బిటనీ చెప్పారు. ప్రతి నలుగురిలో ఒకరు పురుషులే ఉంటున్నారని.. వైరస్‌ కారణంగా శ్వాస ఇబ్బందులతో వచ్చేవారిలో మధ్యవయస్కులు లేదా 60 ఏళ్ల పైబడినవారే అధికమని వెల్లడించారు. ఆస్పత్రి పాలవుతున్న వారిలో.. మృతుల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ అని తెలిపారు. ఇక న్యూయార్క్‌ నగర ఆరోగ్యశాఖ ప్రతినిధి మైఖేల్‌ లాంజా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
(చదవండి: కరోనాతో తగ్గిన గుండె జబ్బులు)

కాగా, న్యూయార్క్‌ నగరంలో 68,776 కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో 15,333 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2,738 మంది మృతి చెందారు. మృతుల్లో 65 నుంచి 75 ఏళ్లలోపు ఎక్కువ ఉండటం గమనార్హం. వారిలోనూ పురుషుల సంఖ్య ఎక్కువ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అమెరికా వ్యాప్తంగా బుధవారం నాటికి 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 12,858 మంది చనిపోయారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకొచ్చిన చైనాలో 3,333 మంది మరణించగా.. వారిలో పురుషుల రేటు 2.8 ఉండగా.. మహిళల రేటు 1.7 గా ఉంది.
(చదవండి: దీనికి ఎంత రేటింగ్ ఇచ్చినా త‌క్కువే)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top