కరోనా పోరు: బీసీజీ టీకాతో భారత్‌కు ఎంతో మేలు!

BCG Vaccination Gives Hope For Countries Fight Against Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 80 వేల మందికి పైగా పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనాపై పోరాటంలో తాజాగా బయటికొచ్చిన ఓ అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్షయ వ్యాధి నివారణలో కీలకంగా పనిచేసే బాసిల్ కాల్మెట్-గురిన్ (బీసీజీ) వ్యాక్సిన్‌ కోవిడ్‌-19 బాధితులు కోలుకునేందుకు చక్కగా పనిచేస్తున్నట్టు ‘కరోనా ఇన్‌ఫెక్షన్‌- బీసీజీ వ్యాక్సినేషన్‌ దేశాల్లో పరిస్థితి’ అంశంపై స్టడీ చేస్తున్న వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో బీసీజీ వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్‌-19 సోకిన బాధితుల్లో శ్వాస సంబంధ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బీసీజీ టీకా రోగ నిరోధక శక్తి పెంచుతోందా అనే దిశగా వారి పరిశోధనలు కొనసాగుతున్నాయి.

కాగా, క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను 1920లో ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక మంది క్షయ బారినపడ్డ దేశంగా పేరు తెచ్చుకున్న భారత్‌లో అది 1948లో అందుబాటులోకి వచ్చింది. బీసీజీ కారణంగా క్షయ వ్యాధి బారినపపడ్డ ఎంతో మంది ప్రాణాలు నిలిచాయని.. అధ్యయన బృందంలో సభ్యుడు, హూస్టన్‌లోని యూరలోజిక్‌ అంకోలజీ అండ్‌ క్యాన్సర్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ ఆశిష్‌ కామత్‌ చెప్పారు. ఇక బీసీజీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగిన దేశాల్లో కరోనా మృతుల రేటు ఒక మిలియన్‌కు 4.28 ఉండగా.. వ్యాక్సినేషన్‌ జరగని దేశాల్లో మరణాల రేటు ఒక మిలియన్‌కు 40గా ఉందని స్టడీ వెల్లడించింది.

సార్వత్రిక, దీర్ఘకాలిక బీసీజీ విధానాలతో ఉన్న దేశాలతో పోల్చితే .. బీసీజీ టీకా విధానాలు లేని అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది. ఇక కరోనాపై యుద్ధంలో బీసీజీ వ్యాక్సినేషన్‌ అనేది భారత్‌కు కలిసొచ్చే అంశమే అయినప్పటికీ.. అంతటితో సంతృప్తి చెందకూడదని కామత్‌ స్పష్టం చేశారు. అయితే, పెద్ద ఎత్తున ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు జరగనిదే.. బీసీజీ టీకాపై నిశ్చిత అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని భారత్‌లోని వైద్యులు చెప్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top