
కొండ చిలువలే పెళ్లిదండలైన వేళ..
అందరిలా మామూలుగా దండలు, ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది అనుకున్నారా యువజంట. అందుకే పదిమందినీ పిలిచారు..
అందరిలా మామూలుగా దండలు, ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది అనుకున్నారా యువజంట. అందుకే పదిమందినీ పిలిచారు.. అబ్బాయి సూటులోను, అమ్మాయి పెళ్లి గౌనులోను వచ్చారు. మధ్యలో పెళ్లి పెద్ద కూడా విచ్చేశారు. ఇక ఉంగరాలు తేవడమే తరువాయి అందరూ అనుకుంటుండగా. ఉన్నట్టుండి బంగారు వర్ణంలో గల రెండు పెద్ద కొండచిలువలను అక్కడకు తీసుకొచ్చారు. విషయం ఏమిటంటే వధూవరులిద్దరూ వన్యప్రాణి ప్రేమికులు. దాంతో జిలిన్ రాష్ట్రంలో జరిగే తమ పెళ్లిని వైవిధ్యంగా చేసుకోవాలనుకున్నారు. అందుకే వాళ్లు దండలు, ఉంగరాలకు బదులు రెండు పెద్ద కొండ చిలువలను మార్చుకున్నారు. ఆ రెండు కొండ చిలువల్లో ఒకటి 30 కిలోలు, మరొకటి 15 కిలోల బరువున్నాయి. అవి తమ బంధానికి ప్రతీకలని వాళ్లు చెబుతున్నారు.
వాళ్లు ఇలా కొండ చిలువలను మార్చుకున్న వీడియో చైనా సోషల్ మీడియా వైబోలో విపరీతంగా వైరల్ అయింది. ముందుగా మెడలో బంగారు రంగు కొండ చిలువను వేసుకున్న వరుడు కనిపిస్తాడు. తర్వాత పక్కన ఉన్న మరో వ్యక్తి సాయంతో ఓ పెద్ద కొండ చిలువను తీస్తాడు. దాన్ని పెళ్లికూతురికి ఇవ్వగా, ఆమె దాన్ని తన మెడలో వేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ కౌగలించుకోగా.. ఒక కొండ చిలువ వాళ్లిద్దరి చుట్టూ అల్లుకుంటుంది. తాను జంతుప్రేమికుడినని పెళ్లి కొడుకు వు జియాన్ ఫెంగ్ ఆ తర్వాత చెప్పాడు. వన్యప్రాణులను సంరక్షించాలనే తాము ఇలా కొండ చిలువలు మార్చుకున్నామని అతడు తెలిపాడు.
ఎప్పుడైనా కొండ చిలువలు కనిపిస్తే వాటిని కొట్టొద్దని.. అవి చాలా మంచివని అన్నాడు. 30 కిలోల కొండ చిలువను పెళ్లికూతురు జియాంగ్ స్యూ ధరించగా, అతడు మాత్రం 15 కిలోల కొండచిలువను ధరించాడు. వీళ్లు తమ ఇంట్లో పలు పాములు, సాలీళ్లు, బల్లులు, కొండ చిలువలు, పక్షులు.. ఇలా అన్నింటినీ పెంచుతారట. నిజానికి బంగారు రంగులో ఉన్నది.. బర్మా జాతికి చెందిన కొండ చిలువేనట. అయితే ఆల్బినో కావడంతో అది ఆ రంగులోకి మారింది. అరుదైన జాతికి చెందిన ఈ కొండ చిలువ పూర్తిగా పెరిగితే 23 అడుగుల వరకు ఉంటుంది. మన దేశంలో అయితే వన్యప్రాణులను ఇళ్లలో పెంచుకోవడం నేరం గానీ, చైనాలో మాత్రం దాన్ని ఎంచక్కా అనుమతిస్తారు.