పన్ను ఎగవేత : హీరోయిన్‌కు భారీ జరిమానా

China Fines Actress Fan Bingbing usd129 Million For Tax Evasion - Sakshi

బీజింగ్‌: చైనాలోని టాప్‌ మోస్ట్‌ నటి ఫ్యాన్‌ బింగ్‌ బింగ్ (37)కు అక్కడి  ప్రభుత్వం  భారీ షాక్‌ ఇచ్చింది. పన్నుఎగవేత కేసులో భారీ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.  పన్నులు ఎగవేత, బకాయిలు కింద  మొత్తం 94 కోట్ల రూపాయలను జరిమానా విధించింది. ఇప్పటికే ఫ్యాన్‌ ప్రతినిధిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను  కొనసాగిస్తున్నారు.

నటిగా మోడల్‌గా  పాప్‌ సింగర్‌గా అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఫ్యాన్‌  పన్ను ఎగవేత కుంభకోణంలో చిక్కుకుంది. ఎక్స్‌ మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌, యాష్‌ ఈజ్‌ పూరెస్ట్‌ వైట్‌ తదితర సినిమాల్లో నటనకు ప్రశంసలందుకున్న ఫ్యాన్‌, ఆమె కంపెనీలు భారీ ఎత్తున పన్నులను ఎగవేసినట్టుగా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ టాక్సేషన్ ఆరోపించింది.  దీంతో129 మిలియన్‌ డాలర్లు (సుమారు 94కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ ఆదేశించింది. లేనిపక్షంలో క్రిమినల్‌ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమె చిత్రం 'ఎయిర్ స్ట్రైక్'లో పాత్ర  చెల్లింపులపై 7.3 మిలియన్ యువాన్ (1.1 మిలియన్ డాలర్లు) పన్నులను తప్పించుకోవటానికి ఫ్యాన్  కాంట్రాక్టులను చీల్చిందనేది ప్రధాన ఆరోపణ. చైనీస్ అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఈ నోటిసును అధికారికంగా  బుధవారం విడుదల చేసింది.

మరోవైపు అభిమానులు, సమాజానికి క్షమాపణలు చెబుతూ చైనా మైక్రో బ్లాగింగ్ సైట్‌ వైబోలో  ఫ్యాన్‌ ఒక ప్రకటన విడుదల  చేసింది. చట్టాన్నిగౌరవిస్తానని స్పష్టం చేసింది. తన ప్రవర్తన, చట్టాల దుర్వినియోగంపై  సిగ్గుపడుతున్నాననీ పేర్కొంది.  దీనికి  దేశంలోని  ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుకుంటున్నానని తెలిపింది.

కాగా దేశంలో లగ్జరీ ఎండార్స్‌మెంట్లతో, అత్యధిక పారితోషికం అందుకునే ఫ్యాన్‌  జూలై 1నుంచి  అకస్మాత్తుగా అదృశ్యమైంది. అలాగే  62 మిలియన్ల ఫాలోవర్లతో చైనీస్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె  జులై 23నుంచి  సైలెంట్‌గా ఉంది. ఈ అనుమానాస్పద అదృశ్యంపై  అనేక రూమర్లు హల్‌చల్‌ చేశాయి. ఒకవైపు అమెరికా ఆశ్రయం కోసం లాస్‌ ఏంజెల్స్‌కి పారిపోయిందనీ, మరోవైపు చైనా అధికారుల నిర్బంధంలో ఉందంటూ పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే పరిణామాల నేపథ్యంలో ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాతలు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. 300 మిలియన్ యువాన్ల ఆదాయంతో  గత ఏడాది, అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన చైనా  ప్రముఖుల ఫోర్బ్స్ మ్యాగజైన్  జాబితాలో టాప్‌లో నిలిచింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top