బాబోయ్‌ కరోనా | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ కరోనా

Published Tue, Jan 28 2020 4:20 AM

China coronavirus death toll climbs to 82 with 2900 cases worldwide - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి సోమవారం వరకు 81 మంది చనిపోయారు. 2,744 మందికి ఈ వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించారు. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ వైరస్‌ మొదట వెలుగు చూసిన వుహాన్‌ నగరంలో సోమవారం చైనా ప్రధాని లీ కెక్వింగ్‌ పర్యటించారు. బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను, వైరస్‌ వ్యాపిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. బాధితులు ఉన్న పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు.

వైరస్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న 32,799 మందిని పరీక్షించామని, వారిలో 583 మందిని ఆదివారం మొత్తం అబ్జర్వేషన్‌లో ఉంచి, సోమవారం డిశ్చార్జ్‌ చేశామని  చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. థాయిలాండ్, జపాన్,    దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేసియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ వైరస్‌ సోకిన కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చైనా పలు చర్యలు తీసుకుంది. నగరంలోకి రాకపోకలు నిషేధించిన జనవరి 23 లోపే వుహాన్‌ నుంచి దాదాపు 50 లక్షల మంది వెళ్లిపోయారని ఆ నగర మేయర్‌ జో జియాన్‌వాంగ్‌ తెలిపారు. ఆ నగర జనాభా దాదాపు      కోటి పదిలక్షలు.

భారతీయుల కోసం మూడు హాట్‌లైన్స్‌
హ్యుబెయి రాష్ట్రంలో ఉన్న భారతీయుల కోసం చైనాలోని భారతీయ రాయబార కార్యాలయం 3 హాట్‌లైన్‌ నెంబర్లను ప్రారంభించింది. వుహాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది భారతీయులను తీసుకురావడానికి సంబంధించి చైనా విదేశాంగ శాఖతో భారతీయ అధికారులు సోమవారం సంప్రదింపులు జరిపారు. కాగా, ముంబైలోనూ పలు అనుమానిత కేసులు నమోదయ్యాయి. స్థానిక కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఒక అనుమానిత వ్యాధిగ్రస్తుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement