ఎన్ఏబీ అధికారుల వలలో అవినీతి చేప!
ప్రభుత్వ అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశాడన్న ఆరోపణలతో ఆర్థిక శాఖ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ రైజాని ఇంటిపై దాడులు నిర్వహించిన ఎన్ఏబీ అధికారులు భారీగా బంగారం, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
	నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అధికారుల  వలలో ఓ పాకిస్తానీ అవినీతి చేప చిక్కింది.  కోట్లకొద్దీ అవినీతి సొమ్మును కూడబెట్టిన బలూచిస్తాన్ లోని ఆర్థిక శాఖ కార్యదర్శిని.. అరెస్టు చేసిన అధికారులు ఆయన ఇంట్లోని 730 మిలియన్ల విలువైన అంటే.. సుమారు 46 కోట్ల రూపాయల విలువైన బంగారం, డబ్బుతోపాటు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశాడన్న ఆరోపణలతో  ఆర్థిక శాఖ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ రైజాని ఇంటిపై దాడులు నిర్వహించిన ఎన్ఏబీ అధికారులు భారీగా ఆస్తులను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
	
	అధికారుల వలలో చిక్కిన అవినీతి తిమింగలం ముస్తాక్ అహ్మద్ రైజానీ ఇంటినుంచీ స్థానిక మరియు విదేశీ కరెన్సీతోపాటు బంగారం నింపిన సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఏబీ అధికారులు వెల్లడించారు. ముస్తాక్ ఇంట్లోని అన్ని గదుల్లోనూ జల్లెడ పట్టామని, తదుపరి దర్యాప్తుకోసం ఫైనాన్స్ శాఖ.. రికార్డులు కూడ స్వాధీనం చేసుకుట్లు తెలిపారు. బలూచిస్తాన్ లో ఓ ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న రైజాని గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పిపిపి ప్రభుత్వ పాలనా కాలంనుంచీ  కూడ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. దాడుల అనంతరం రైజానీ ఇంట్లో భారీ మొత్తంలో అవినీతి సొమ్ము చిక్కిన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం రైజానీని సస్పెండ్ చేస్తున్నట్లుగా అర్థరాత్రి ప్రకటించింది. అంతేకాక ఓ బాధ్యతగల ప్రభుత్వాధికారిగా ఆయన ఎన్ ఏ బీ విచారణకు పూర్తిగా సహకరించాలని కూడ సూచించింది.
	
	రైజానీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు మిర్ ఖలిద్ తన పదవికి రాజీనామా చేశారు. తమ శాఖలో ఓ వ్యక్తి అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు గాను.. తాను స్వచ్ఛందంగా  పదవికి రాజీనామా చేసినట్లు మిర్ ఖలిద్ తెలిపారు. సింథ్ ప్రాంతంలో అరెస్టుల తర్వాత, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాలక ప్రభుత్వంలోని ఆర్థిక శాఖలో అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయల విలువచేసే సొమ్మును దోచుకొన్న అధిక ప్రొఫైల్ అధికారిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
