రూటు మార్చిన పైలట్‌.. బిత్తరపోయిన ప్రయాణికులు..!

British Airways Flight Landed Mistakenly In Edinburgh Airport - Sakshi

ఎడిన్‌బర్గ్‌ : బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ పైలట్‌ ప్రయాణికులకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. జర్మనీలో ల్యాండ్‌ కావాల్సిన ఫ్లైట్‌ను స్కాట్లాండ్‌లో ల్యాండ్‌ చేశాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ‘బీఏ 146’ విమానం 100 మంది ప్రయాణికులతో లండన్‌ నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్‌కు బయలుదేరింది. కానీ, అది దారితప్పి 500 మైళ్లు అదనంగా ప్రయాణించింది. నేరుగా తూర్పు దిశగా వెళ్లకుండా ఉత్తరం వైపుకు దూసుకెళ్లింది. చివరకు స్కాట్లాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. ఫ్లైట్‌లో ఉన్నవారంతా అది డ్యూసెల్డార్ఫ్‌ అనే అనుకున్నారు. అయితే,‘వెల్‌కమ్‌ టు ఎడిన్‌బర్గ్‌’ అని విమానం కాక్‌పిట్‌ నుంచి అనౌన్స్‌మెంట్‌ వినగానే ఆశ్చర్యంలో మునిగారు. పైలట్‌ జోక్‌ చేస్తున్నాడేమోనని భావించారు.

అది ఎడిన్‌బర్గ్‌ అని తెలిసి నోరెళ్లబెట్టారు. డ్యూసెల్డార్ఫ్‌కు తరచుగా ప్రయాణించే సోఫీ కూక్‌ అనే మహిళ బీబీసీతో మట్లాడుతూ.. ఎడిన్‌బర్గ్‌కు చేరుకున్నామని పైలట్‌ చెప్పగానే ఆశ్చర్యపోయాను. అతను చెప్పిందే నిజమేనని గ్రహించాను. చేసిన ఘటనకార్యం చాలదా అన్నట్టు విమాన సిబ్బంది.. ‘మీరంతా డ్యూసెల్డార్ఫ్‌కు వెళ్లాలనుకుంటున్నారు కదా’ అని అడిగారని ఆమె మండిపడ్డారు. ‘అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఫ్లైట్‌ మ్యాప్‌ ప్రకారమే విమానం ప్రయాణం చేసింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు’ అని పైలట్‌ చెప్పుకొచ్చాడు. కాగా, రెండున్నర గంటల అనంతరం విమానం మళ్లీ జర్మనీ బయలుదేరింది. కాగా, అనుకోకుండా ఇలా కలిసొచ్చిందని.. ఇదొక బోనస్‌ ట్రిప్‌ అని మరి కొందరు వ్యాఖ్యానించారు.

విమానం రూట్‌ ప్లాన్‌

ఇదిలాఉండగా.. ప్రయాణికుల విలువైన సమయాన్ని రాంగ్‌ ల్యాండింగ్‌ ద్వారా వృథా చేసినందుకు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ క్షమాపణలు కోరింది. ఫ్లైట్‌మ్యాప్‌లో డబ్ల్యూడీఎల్‌ సంస్థ చేసిన తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగిందని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించింది. ఘటనపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఫ్లైట్‌ప్లాన్‌లు తారుమారైన వ్యవహారాన్ని కనుగొంటామని తెలిపింది. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానాన్ని జర్మనీ కంపెనీ డబ్ల్యూడీఎల్‌ ఏవీయేషన్‌ సంస్థ లీజ్‌ ప్రాతిపదికన నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top