కరోనా కరాళ నృత్యం

15100 Peoples Lifeloss In The World Due To Coronavirus - Sakshi

15,100 దాటిన వైరస్‌ మరణాలు

ఇద్దరికంటే ఎక్కువ మంది గుమికూడరాదని జర్మనీ ఆదేశం

రోమ్‌/వాషింగ్టన్‌/టెహ్రాన్‌/మాడ్రిడ్‌ : కోవిడ్‌-19 పై దేశాలు యుద్ధాన్ని ముమ్మరం చేశాయి. సుమారు వంద కోట్ల మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. వైరస్‌ విలయాన్ని అడ్డుకునేందుకు దేశాలు పలు నియంత్రణ చర్యలు చేపట్టినా.. సోమవారం నాటికి ఈ మహమ్మారి కారణంగా 15,189 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా దాదాపు 3.50 లక్షల మంది వ్యాధి బారిన పడి సతమతమవుతున్నారు. గత ఏడాది చైనాలో తొలిసారి కనిపించిన కరోనా వైరస్‌ 170కిపైగా దేశాలకు విస్తరించింది. కోవిడ్‌ మరణాల సంఖ్యలో చైనాను మించిపోయిన ఇటలీలో మొత్తం 5,476 మంది మరణించినట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య ఈ దేశంలో 59,138కి చేరుకుంది. పలుచోట్ల వేల పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు.  

చైనాలో 39 కొత్త కేసులు...
మూడు రోజుల పాటు కొత్త కేసులేవీ నమోదు కాని చైనాలో ఆదివారం విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏకంగా 39 కొత్త కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. హాంకాంగ్, మకావులను మినహాయిస్తే చైనా మొత్తమ్మీద వైరస్‌ బాధితుల సంఖ్య 81,093కు చేరింది. 72,703 మందికి నయమైనట్లు సమాచారం. వ్యాధి కారణంగా చైనాలో ఇప్పటివరకూ 3,270 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు యూరోపియన్‌ దేశం స్పెయిన్‌లో మొత్తంగా  2,182 మంది మరణించారు. ఈ దేశంలో 33,089 మంది కోవిడ్‌ బాధితులు ఉన్నారు. ఇరాన్‌లోనూ ఒక రోజులో 127 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1812కు, కేసుల సంఖ్య 23,049కు చేరుకుంది. ఫ్రాన్స్‌లో మొత్తం 674 మంది కోవిడ్‌కు బలికాగా, 16,018 మంది వైరస్‌ బారిన పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ 419 మందిని బలితీసుకుంది. ఈ వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 35,224కు చేరింది. ఖండాలు, ప్రాంతాల వారీగా చూస్తే.. యూరప్‌లో 9,197 మంది ప్రాణాలు కోల్పోగా, 1.72 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. ఆసియాలో దాదాపు లక్ష మంది వ్యాధి బారిన పడగా, 3,539 మంది ప్రాణాలు కోల్పోయారు.

వలసదారులకూ పరీక్షలు
దేశంలోని అక్రమ వలసదారులతోపాటు తగిన పత్రాలు లేని భారతీయులకూ కరోనా వైరస్‌ పరీక్షలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. కేవలం 24 గంటల్లోనే అమెరికాలో 5,418 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. జర్మనీ ఛాన్సలర్‌ మెర్కెల్‌ సోమవారం ఒక ఉత్తర్వు జారీ చేస్తూ దేశవ్యాప్తంగా ఇద్దరి కంటే ఎక్కువమ ంది ఒక చోట గుమికూడరాదని స్పష్టం చేశారు.  దేశంలో ఇటలీ తరహా మరణాలు సంభవించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఉందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌  హెచ్చరించారు.

స్పెయిన్‌లో ఒక్కరోజే 462 మరణాలు
యూరోపియన్‌ దేశం స్పెయిన్‌లో ఒక్కరోజే 462 మంది మరణించారు. దేశంలో మొత్తంగా 2,182 మంది కోవిడ్‌కు బలయ్యారని, ఆరోగ్య శాఖ తెలిపింది. స్పెయిన్‌లో మార్చి 14 నుంచే అసాధారణ రీతిలో నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ మొత్తం 33,089 మంది వ్యాధి బారిన పడటం గమనార్హం. నియంత్రణ చర్యలను రెండు వారాలకే పరిమితం చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 11వ తేదీ వరకూ పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నాలుగు రోజుల్లో లక్ష మందికి..
వేగం అందుకున్న కరోనా: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా : కరోనా వైరస్‌ వేగాన్ని అందుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గేబ్రేసెస్‌ ప్రకటించారు. ‘‘మొదటి లక్ష కేసుల నమోదుకు 67 రోజులు తీసుకుంది. తర్వాతి లక్ష కేసులు 11 రోజుల్లోనే నమోదయ్యాయి. తదుపరి లక్ష కేసులకు కేవలం నాలుగు రోజులే పట్టింది. అయితే మనం నిస్సహాయులమేమీ కాదు. ఈ మహమ్మారి గతిపథాన్ని మార్చగలం’’అని టెడ్రోస్‌ సోమవారం మీడియాతో పేర్కొన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top