రోజాను సభలోకి అనుమతించేది లేదు

రోజాను సభలోకి అనుమతించేది లేదు - Sakshi


అసెంబ్లీ సమావేశాలకు రోజా హాజరు కావచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నా.. ఆమెను మాత్రం సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ కార్యాలయం చెబుతోంది. ఈ మేరకు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు, మార్షల్స్, మహిళా మార్షల్స్‌ను మోహరించారు. రోజాను లోపలకు రాకుండా అడ్డుకున్నారు. రోజాను కేవలం అసెంబ్లీ ప్రాంగణంలోకి మాత్రమే అనుమతిస్తాము గానీ, సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దాంతో అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 9 గంటలకు కొద్దిముందుగానే అసెంబ్లీకి చేరుకున్న రోజా, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు.మా దగ్గర హైకోర్టు ఉత్తర్వులున్నాయి, మీ దగ్గర ఏముందో చూపించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ చెప్పారని అనగా.. ఉత్తర్వుల కాపీ ఉంటే చూపించాలని అడిగారు. దాంతో చీఫ్ మార్షల్ ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ, అప్పటికి కూడా రోజాను మాత్రం లోపలకు అనుమతించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే అధికారం మీకెక్కడిదని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీంతో ఈ విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే లోపలకు వెళ్తామని, అప్పటివరకు అంతా ఇక్కడే ఉంటామని గేట్ 2 వద్ద అందరూ ఆగిపోయారు. ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా అని ప్రశ్నిస్తున్నారు.మొత్తమ్మీద ఈ వ్యవహారం శాసన వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య పోరాటంలా మారే పరిస్థితి కనిపిస్తోంది. శాసనవ్యవస్థ అత్యున్నతమైనదని, దీంట్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం కుదరదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గురువారమే వ్యాఖ్యానించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top