ప్రజాసమస్యల మీద పోరాటం కొనసాగిస్తా: రోజా | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యల మీద పోరాటం కొనసాగిస్తా: రోజా

Published Thu, Mar 17 2016 11:15 AM

ప్రజాసమస్యల మీద పోరాటం కొనసాగిస్తా: రోజా - Sakshi

ప్రజాసమస్యల మీద తన పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, తన నియోజకవర్గ ప్రజలందరిదీనని ఆమె అన్నారు. తన హక్కుల గురించి ఆలోచించిన హైకోర్టు, తాను అసెంబ్లీకి వెళ్లేవిధంగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు కలగజేసుకుని న్యాయం చేస్తాయన్న విషయం మరోసారి రుజువైందని, న్యాయ వ్యవస్థపై తన నమ్మకం రెట్టింపు అయిందని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆమె తమ న్యాయవాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఇక ముందు కూడా తాను ప్రజల సమస్యల మీద గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తానని రోజా చెప్పారు. తాను 1999లో రాజకీయాల్లోకి వచ్చానని, ఆరోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఏదైనా ప్రజాసమస్యల మీద పోరాడుతూనే ఉన్నానని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కూడా పోరాటం చేస్తానని చెప్పారు. తన పోరాటం ఎప్పుడూ అంశాల వారీగానే ఉంటుందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ రాగానే అసెంబ్లీకి వెళ్తానని,  జరిగిన అన్ని విషయాల మీద వివరణ ఇస్తానని ఆమె తెలిపారు. తాను తప్పు చేయనప్పుడు హాజరు కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

రాజ్యాంగం ఉల్లంఘించినవారికి సమాధానం
తనకు చాలా సంతోషంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి తగిన సమాధానం చెప్పినట్లయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. అయితే కోర్టు ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే పెద్దగా చెప్పనని, ప్రజలకు రాజ్యాంగంపై విశ్వాసం ఉందని.. అది మరోసారి నిలబడిందని ఆమె అన్నారు. సరైన వేదికపై ఎమ్మెల్యేకున్న హక్కులను న్యాయస్థానం పునరుద్ధరించిందని, పౌరుల హక్కులను రాజ్యాంగమే కాపాడగలదని చెప్పారు. రోజా ఈరోజే అసెంబ్లీకి వెళ్లచ్చని, అసెంబ్లీ కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు వెళ్తున్నాయని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement