సోనియా గాంధీ పేరుతో ఓటు నమోదుకు దరఖాస్తు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పేరుతో ఓటు నమోదుకు ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తి దరఖాస్తు చే సిన సంఘటన కలకలం సృష్టించింది.
సరూర్‌నగర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పేరుతో ఓటు నమోదుకు ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తి దరఖాస్తు చే సిన సంఘటన కలకలం సృష్టించింది. సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని గాయత్రినగర్, ఇంటినెం. 1-2-3 చిరునామాతో ఫారం నెం.6ను ఆన్‌లైన్‌లో ఈ-రిజిస్ట్రేషన్ చేశారు. సోమవారం ఇది సిబ్బంది పరిశీలనలో బయటపడింది. 2001, మే 12 నుంచి గాయత్రినగర్‌లో సోనియా గాంధీ నివాసం ఉంటున్నట్లు దరఖాస్తు చేశారు.
సోనియా, భర్త రాజీవ్, ఇంటి పేరు గాంధీ, వయసు (66) అని, పుట్టిన తేదీ 09 డిసెంబర్ 1947గా పేర్కొన్నారు. 44వేల 679 మంది ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో ఈ-రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వాటిని పరిశీలిస్తున్న తరుణంలో ఈ దరఖాస్తు బయటపడిందని సరూర్‌నగర్ మండల డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖుల పేర్లను ఇలా దుర్వినియోగం చేయడం నేరమన్నారు. దీనిపై ఆయన మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


