‘మావో’లతో దోస్తీ!

‘మావో’లతో దోస్తీ! - Sakshi


కలసి పని చేసేందుకు ఉగ్రవాదుల ఆసక్తి

2010లో చోటా షకీల్ ద్వారా ఐఎస్‌ఐ యత్నం

గతేడాది జేకేహెచ్ ద్వారా ఐసీస్ ప్రయత్నం

ఈ రెండూ హైదరాబాద్ కేంద్రంగా సాగిన వ్యవహారాలే

ఆయుధాలు, 'తంత్రాల'కోసమేననే సందేహాలు


ఉగ్రవాదులు మాఫియాను పక్కన పెడుతూ మావోయిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారా..? వారితో జట్టుకట్టి పని చేయడానికి ప్రయత్నిస్తున్నారా.. అంటే ఔననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రెండు ఉదంతాలు వెలుగులోకి రావడమే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నాయి. మావోయిస్టులతో మిలాఖత్ కోసం 2010లో ఐఎస్‌ఐ చోటా షకీల్ ద్వారా ప్రయత్నించగా.. గతేడాది ఐసిస్ జేకేహెచ్ ఉగ్రవాది నఫీజ్‌ఖాన్ ద్వారా జేకేహెచ్ ముసుగుతో యత్నించింది. ఉగ్రవాదులకు ఆయుధాల సమీకరణకు తేలికైన మార్గం కావడం, వారి యుద్ధ తంత్రాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలోనే మావోయిస్టులతో దోస్తీకి మొగ్గుచూపుతున్నట్లు భావిస్తున్నారు. - సాక్షి, హైదరాబాద్

 

ఆరేళ్ల క్రితం ఐఎస్‌ఐ

మావోయిస్టులను ట్రాప్ చేయడం ద్వారా రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించేం దు కు పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పన్నినకుట్ర 2010 ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు రాష్ట్రంలోని మావోయిస్టులను ట్రాప్ చేసి, విధ్వం సం సృష్టించేందుకు దావూద్ గ్యాంగ్‌కు చెందిన వినయ్‌కుమార్, దేవయ్య అలియాస్ సచిన్‌లను రంగంలోకి దింపారు. వారు బెంగళూరులో మకాం వేసి పాకిస్తాన్, దుబాయ్‌లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌లతో సంప్రదింపులు జరిపారు. ఈ ఆపరేషన్ కోసం ఐఎస్‌ఐ వారికి హవాలా ద్వారా రూ.25 లక్షలు పంపింది. అనంతరం వారు హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్, శరత్, ప్రదీప్, పవన్‌ల సాయంతో మావోయిస్టు నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధపడుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వారిద్దరూ ఉగ్రవాదుల్ని కలసి రావడానికి హైదరాబాద్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విమానం టికెట్లు కూడా కొనుగోలు చేశారు. కానీ కుట్ర అమల్లోకి రాకముందే బెంగళూరు, హైదరాబాద్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.

 

తాజాగా ఐసిస్..

ఉగ్రవాద సంస్థ ఐసిస్ తనకు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్ (జేకేహెచ్)’ మాడ్యూల్‌ను మావోయిస్టులతో మిలాఖత్ కోసం వినియోగించింది. ఆ మాడ్యూల్‌కు నం.2గా వ్యవహరించిన హైదరాబాదీ మహ్మద్ నఫీజ్‌ఖాన్ ద్వారా అవసరమైన మంతనాలు జరిపింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో అనుచరుడు ఆషిఖ్‌తో కలసి రెండుసార్లు జార్ఖండ్‌లోని హబారీబాగ్ వెళ్లిన నఫీజ్‌ఖాన్... అక్కడ కొందరు మావోయిస్టులతో సంప్రదింపులు జరిపాడు. అయితే అవి కార్యరూపంలోకి రాక ముందే మాడ్యూల్ పట్టుబడింది.

 

ఆ ‘రెండింటి’ కోసమే..!

కొన్నేళ్లుగా ఉగ్రవాదుల పంథాలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాంబులు తయారు చేయడానికి పొరుగు దేశాల నుంచి పేలుడు పదార్థాలు ‘దిగుమతి’ చేసుకునేవారు. తర్వాత స్థానికంగానే సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. ఇలా పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాల సమీకరణకు సహాయ సహకారాలు పొందడానికే ఉగ్రవాదులు మావోల వైపు మొగ్గుతున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా లోన్‌వూల్ఫ్ ఎటాక్స్ పెరుగుతున్నాయి. ఎలాంటి మాడ్యూల్ లేకుండా ఎవరంతట వారే ఉగ్ర బాటపట్టి ఆపరేషన్స్ చేయడమే ఈ విధానం. అలాంటి లోన్‌వూల్ఫ్‌లకు గెరిల్లా యుద్ధ తంత్రాలు అవసరమని భావిస్తున్న ఉగ్రవాద సంస్థలు.. వాటిని నేర్పడానికి మావో ల్ని వినియోగించుకోవాలని యోచిస్తున్నాయని భావిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top