నటుడు రంగనాథ్ ఆత్మహత్య | Telugu actor Ranganath died | Sakshi
Sakshi News home page

నటుడు రంగనాథ్ ఆత్మహత్య

Dec 20 2015 4:35 AM | Updated on Apr 3 2019 9:02 PM

నటుడు రంగనాథ్ ఆత్మహత్య - Sakshi

నటుడు రంగనాథ్ ఆత్మహత్య

ప్రముఖ సినీనటుడు రంగనాథ్ (66) శనివారం మృతి చెందారు. కవాడీగూడలోని ఆయన నివాసంలో రంగనాథ్ మరణించారు.

ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణం
 
 హైదరాబాద్: కాసేపట్లో ఆత్మీయుల మధ్య సన్మానం.. వేదిక అందంగా ముస్తాబైంది.. అందరూ వచ్చారు.. అంతా ‘ఆయన’ కోసమే ఎదురుచూస్తున్నారు.. ఇంతలో పిడుగులాంటి వార్త! సన్మానానికి రావాల్సిన ఆయన శాశ్వత లోకాలకు వెళ్లిపోయారు! అభిమానులు, ఆత్మీయులను వదిలి ఉరితాడుకు వేలాడారు. ప్రముఖ సినీ నటుడు రంగనాథ్(66) శనివారం హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడు, ‘నేటి నిజం’ ఎడిటర్ బైసా దేవదాసుకు ‘గుడ్ బై సార్..’ అంటూ తన మొబైల్ నుంచి చివరిసారిగా ఎస్సెమ్మెస్ పంపారు. ఉరివేసుకున్న గదిలో గోడలపై... ‘నా బీరువాలో పని మనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంక్ బాండ్స్‌ను ఆమెకు అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్’ అని రాశారు.

 ఏం జరిగింది?
 సాయంత్రం 4 గంటల సమయంలో మల్కాజిగిరిలోని గౌతమ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రంగనాథ్ వెళ్లాల్సి ఉంది. ఆయనను కారులో తీసుకెళ్లేందుకు సభ నిర్వాహకులు ఇంటికి వచ్చారు. తలుపు తట్టినా ఎంతకీ తెరవకపోవడంతో సమీపంలో నివసించే పెద్ద కుమార్తె నీరజకు కబురు చేశారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ కలసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దించి వెంటనే నర్మదా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రంగనాథ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలో సబర్మతి నగర్‌లో ఉన్న రంగనాథ్ ఐదేళ్ల క్రితమే గాంధీనగర్ వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 2009లో భార్య చైతన్య మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నారు. పని మనిషి మీనాక్షి రంగనాథ్‌కు వంట చేసి పెడుతోంది. పెద్ద కూతురు నీరజ సమీపంలోని విజయబ్యాంక్ దగ్గర నివసిస్తున్నారు. రెండో కుమార్తె శైలజ, కుమారుడు నాగు బెంగళూరులో నివసిస్తున్నారు. పోస్టుమార్టం కోసం భౌతికకాయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 సంతాప సభగా మారిన సన్మాన సభ
 మల్కాజిగిరి గౌతంనగర్‌లోని గౌతమి మహిళా మండలి ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రంగనాథ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అతిథిని పిలవడానికి నిర్వాహకులు రంగనాథ్ ఇంటికి వెళ్లే సరికి ఘోరం జరిగిపోయింది. చివరికి ఆయనను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన సభను సంతాప సభగా మార్చి నివాళులు అర్పించారు.

 ఆయనది అసమాన ప్రతిభ: చంద్రబాబు
 రంగనాథ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కథా నాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లో అసమాన నటనా ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. రంగనాథ్ కుటుంబీకులకు సానుభూతిని తెలిపారు.

 జగన్ సంతాపం
 రంగనాథ్ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
 భార్యకు గుండెలో గుడి కట్టి..
 రంగనాథ్‌కు భార్య చైతన్య అంటే అమితమైన ప్రేమ. దేవతలా పూజించేవారు. ఇంట్లోని పూజా మందిరంలో దేవుడి ఫోటోల పక్కన భార్య ఫోటోను పెట్టుకున్నారు. ఈ దేవుడి ఫోటోలపై ‘డెస్టినీ’ (విధి) అని రాసి ఉంది. భార్యకు పక్షవాతం వచ్చినప్పుడు ఆమెకు సేవలు చేశారు. రంగనాథ్ నిత్యం.. ‘కాల్ ఫర్ గాడ్..’ అనే వారని తెలిసింది. భార్య మరణం తర్వాత రంగనాథ్ ఒంటరివారయ్యారు. ఎప్పుడూ భార్య గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండేవారని తెలిసింది. దానికి తోడు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందుల వల్లే రంగనాథ్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
 
 టీసీ నుంచి సినిమా రంగంలోకి..
 1949లో చెన్నైలో జన్మించిన రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్(టీసీ)గా పనిచేస్తూ సినిమాపై ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. బుద్ధిమంతుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ‘చందన’ చిత్రంలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది మాత్రం ‘పంతులమ్మ’ చిత్రం. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకుపైగా నటించారు. పలు టీవీ సీరియళ్లల్లోనూ కనిపించారు. ‘మొగుడ్స్-పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. 50 చిత్రాల్లో హీరోగా, మరో 50 చిత్రాల్లో ప్రతినాయకుడిగా, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

రంగనాథ్‌ నటించిన కొన్ని చిత్రాలు...
అందమే ఆనందం
ఇంటింటి రామాయణం
మావూరి దేవత
వేట
త్రినేత్రుడు
రుద్రనేత్ర
కొదమసింహం
కొండవీటి దొంగ
తాయారమ్మ బంగారయ్యా
విజేత
రామచిలుక
జమీందారుగారి అమ్మాయి
సెక్రటరీ
గృహప్రవేశం
ఖైదీ
దొంగమొగుడు
చిరంజీవీ
అమెరికా అమ్మాయి
లవ్‌ ఇన్‌ సింగపూర్‌
ప్రేమంటే ఇదేరా
దేవతలారా దీవించండి
శ్రీరామదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement