రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోండి | Take action on Kodali Nani and Roja | Sakshi
Sakshi News home page

రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోండి

Feb 20 2016 2:28 AM | Updated on Oct 29 2018 8:08 PM

రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోండి - Sakshi

రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోండి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోవాల్సిందిగా శాసనసభ నైతిక విలువల కమిటీ(ఎథిక్స్)కి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది.

ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసిన ‘మండలి’ కమిటీ
నిరసన తెలిపిన శ్రీకాంత్‌రెడ్డి

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, కొడాలి నానిలపై చర్య తీసుకోవాల్సిందిగా శాసనసభ నైతిక విలువల కమిటీ(ఎథిక్స్)కి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. శాసనసభ సజావుగా జరగకుండా అడ్డుకునే వారిపట్లా కఠినంగా వ్యవహరించాలని కోరింది. శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22న జీరో అవర్‌లో జరిగిన చర్చలతోపాటు, అంతకుముందు సభలో జరిగిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి రావటంపై విచారణ జరిపేందుకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటీని వేయడం తెలిసిందే. ఇందులో గడికోట శ్రీకాంత్‌రెడ్డి(వైఎస్సార్‌సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్(టీడీపీ), పి.విష్ణుకుమార్‌రాజు(బీజేపీ) సభ్యులుగా ఉన్నారు.

కమిటీ తుది సమావే శం శుక్రవారం జరిగింది. నివేదికను రూపొందించింది. సమావేశానికి బుద్ధప్రసాద్‌తోపాటు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. విష్ణుకుమార్‌రాజు రాలేదు. తుది నివేదికలోని అంశాల్ని ఫోన్‌లో వివరించగా ఆయన తన సమ్మతి తెలిపారు. నివేదికలో వైఎస్సార్‌సీపీ సభ్యులపై చర్య తీసుకునే అంశాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు గడికోట పేర్కొంటూ కమిటీకి తన నిరసనను తెలియజేశారు. అసెంబ్లీ సమావేశ వివరాలు మీడియాలో లీకయ్యాయని చెప్పినా పట్టించుకోకపోవటం పట్ల ఆయన నిరసన తెలిపారు. రోజా, నానిలతోపాటు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మరికొందరు వైఎస్సార్‌సీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని శ్రావణ్‌కుమార్(టీడీపీ) కోరా రు. నివేదికను ఈనెల 22లోగా స్పీకర్ శివప్రసాదరావుకు అందచేస్తారు. ఆయన దాన్ని ఎథిక్స్ కమిటీకి పంపుతారు. అది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా పూర్తిచేసే వీలుంది.

 విచారణకు గడికోట పట్టు..
 అసెంబ్లీ సమావేశాల వివరాలు సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం కావటంపై విచారణ జరపాల్సిందిగా గడికోట కమిటీ సమావేశంలో పదేపదే కోరారు. అయితే ఏ సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమయ్యాయో వివరాలు చెబితే విచారణ జరుపుతామని కమిటీ చైర్మన్, మిగిలిన సభ్యులు, అధికారులు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులను గుర్తించటంతోపాటు వారిపై చర్య తీసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఇందుకు కమిటీలోని  సభ్యులు స్పందించలేదు. సమావేశానంతరం గడికోట విలేకరులతో మాట్లాడుతూ తమ సభ్యులపై బురద చల్లటంతోపాటు వారిని లక్ష్యంగా చేసుకుని కమిటీ పనిచేసిన ట్లుగా ఉందని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన నోట్‌ను అందించానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement