తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నన్నారు. దాంతో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
అంతకుముందు కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట ధర్నాకు దిగారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన హక్కులు, వేతనాలు పెంచాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగి వారంపైన అయినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద నీళ్లు పోసిన చందంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ను చెత్తా హైదరాబాద్గా మార్చిందని ఎద్దేవా చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు వీహెచ్, అంజన్కుమార్ యాదవ్, పొన్నాల, షబ్బీర్ అలీతోపాటు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.