వీధికుక్కల వీరంగం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది.
హైదరాబాద్: వీధికుక్కల వీరంగం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ గ్రామానికి చెందిన సంగారెడ్డి చాలాకాలం క్రితం నగరానికి వచ్చి ఓల్డ్ కాప్రాలో నివాసం ఉంటున్నాడు. అతని కూతురు సోనీ(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం వారి ఇంటి సమీపంలో వీధి కుక్కలన్నీ ఒకచోట చేరి పోట్లాడుతూ వీరంగం సృష్టించాయి.
అదే సమయంలో అటుగా వెళ్తున్న సోనీపైకి కుక్కలన్నీ ఒక్కసారిగా దూసుకురావడంతో చిన్నారి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందింది. వీధి కుక్కల బెడదను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, వారి నిర్లక్ష్యం మూలంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.