ఆర్డీఎస్ పనులను నిలిపివేయండి | Stop doing things of RDS | Sakshi
Sakshi News home page

ఆర్డీఎస్ పనులను నిలిపివేయండి

May 18 2016 4:10 AM | Updated on Sep 4 2017 12:18 AM

ఆర్డీఎస్ పనులను నిలిపివేయండి

ఆర్డీఎస్ పనులను నిలిపివేయండి

నదీ జలాలపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. ఒక సమస్య వెంట మరో సమస్య ఉత్పన్నమవుతున్నాయి.

♦ రాయచూర్ కలెక్టర్‌కు ఆదోని ఆర్డీవో లేఖ
♦ ఏపీ తీరుకు నిరసనగా సాగర్ నీటి విడుదలను నిలిపేసిన తెలంగాణ
♦ జోక్యం చేసుకున్న కృష్ణాబోర్డు.. 1.4 టీఎంసీల విడుదల
 
 సాక్షి, హైదరాబాద్: నదీ జలాలపై తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. ఒక సమస్య వెంట మరో సమస్య ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) పనులను అడ్డుకునే ప్రయత్నం చేసి ఏపీ మరో జగడానికి తెరలేపింది. ఏపీలోని ఆదోని ఆర్డీవో తమ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్డీఎస్ పనులను చేపట్టరాదంటూ కర్ణాటకలోని రాయచూరు జిల్లా కలెక్టర్, ఇంజనీర్లకు లేఖ రాయడం వివాదం రేకెత్తించింది. ఈ వివాద పరిష్కారం కోసం మంత్రి హరీశ్‌రావు చొరవ చూపినా... ఏపీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం. దీంతో ఏపీ తీరుకు ప్రతిగా నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలను తెలంగాణ నిలిపివేసింది. కానీ చివరికి బోర్డు జోక్యంతో మంగళవారం సాయంత్రం నీటిని విడుదల చేసింది.

 చర్చలకు ముందుకు రాని ఏపీ..
 ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉన్నా 4 టీఎంసీలకు మించి అందడం లేదు. మొత్తంగా 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో 20 వేల ఎకరాలకు మించి రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును మరో 6 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా.. అందుకు కర్ణాటక అంగీకరించింది కూడా. ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు తెలంగాణ రూ.72 కోట్ల మేర డిపాజిట్ చేసింది. కానీ ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతున్నారు. దీంతో ఇటీవలే మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి... పనులను 50 రోజుల్లో పూర్తిచేసేలా ఒప్పించింది.

ఈ సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుదామని ఏపీ జల వనరుల మంత్రి దేవినేని ఉమకు హరీశ్‌రావు ఫోన్ చేసినా సానుకూల స్పందన రాలేదు.  కాల్వల ఆధునీకరణ పనులను కర్ణాటక మొదలుపెట్టింది. కానీ సోమవారం ఆ పనులను కర్నూలు జిల్లా అధికారులు అడ్డుకున్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ పనులు చేయరాదని... ఏదైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే దానికి  కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలని కర్నూలు ఆర్డీవో రాయచూర్ కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో కర్ణాటక అధికారులు పనులు నిలిపివేశారు. ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా... ఆయన మరోసారి ఏపీ మంత్రి దేవినేని ఉమాతో ఫోన్‌లో మాట్లాడారు. 2 రోజుల్లో  నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎలాంటి సహకారం ఉండదని స్పష్టం చేశారు. దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

 సాగర్ నీటిని ఇవ్వని తెలంగాణ
 ఆర్డీఎస్ పనుల పట్ల ఏపీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ నాగార్జునసాగర్ నుంచి ఏపీలోని కృష్ణా డెల్టాకు నీటి సరఫరాను నిలిపివేసింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల జరిగినా... సాగర్ నుంచి నీటిని విడుదల చేసేది లేదని భీష్మించింది. దీంతో తెలంగాణ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏపీకి నీటి విడుదల చేయాలంటూ బోర్డు మంగళవారం తెలంగాణకు లేఖ రాసింది. దీంతో బోర్డు ఆదేశాలను గౌరవిస్తూ  సాగర్ నుంచి మంగళవారం సాయంత్రం నీటిని విడుదల చే శారు. ఇదే సమయంలో ఆర్డీఎస్ పనులను కొనసాగించేలా ఏపీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement